తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2వ తేదీ లేదా 3వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఈ నెల 29వరకు శాసనసభ సమావేశాలు, ఆ తర్వాత వరుసగా అమావస్య, ఉగాది, రంజాన్ పర్వదినాలు ఉండటంతో రెండు,మూడు తేదీలను ఖరారు చేశారు. మంత్రి వర్గంలో మొత్తం ఆరు ఖాళీలు ఉండగా ఈ దఫా ఎంతమందిని తీసుకుంటారనే ఆంశంలో కాంగ్రెస్ అధిష్టానం చర్చోపచర్చలు జరుపుతోంది.
ఆరింటిలో నాలుగు భర్తీ చేస్తారని…ఎన్నికల ముందు రాజకీయ అవసరాలకు అనుగుణంగా మొత్తం భర్తీ చేస్తారని ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ దఫా నాలుగు నుంచి ఐదు ఖచ్చితంగా భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి జిల్లాల వారిగా మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులను పరిశీలిస్తే నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (రెడ్డి) –ఇప్పటికే మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు. పార్టీలో చేరే సమయంలోనే మంత్రి పదవి భరోసాతోనే వచ్చారని… అందుకే ఆయనకు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (బీసీ) –బీసీ కోటా లో తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. బాలు నాయక్ (ఎస్టీ) – దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎస్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. అయితే వాకిటి శ్రీహరిని తీసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో బలపడతామనే వాదన తప్పని… ఆయనను తీసుకుంటే వారిని వ్యతిరేకించే కులాలు పార్టీకి దూరమవుతాయని హస్తం నేతల్లో చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సమీప బంధువు సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఒక్క మంత్రి కూడా లేని తమ జిల్లాకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు..రెడ్డి వర్గంలో ఒక మంత్రి పదవి ఆయనకు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని చర్చ జరుగుతుంది.
రంగారెడ్డి జిల్లా నుండి ప్రాతినిధ్యం లేకపోవడంతో కేబినెట్ లో మంత్రి గా అవకాశం కల్పించాలని మల్ రెడ్డి రంగారెడ్డి (రెడ్డి) –ఓసి కోటా లో లాబీయింగ్ చేస్తున్నారు. మైనార్టీల ఎమ్మెల్యే లేకపోవడంతో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ (ముస్లిం మైనారిటీ) – ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నారు. సీఎంకు సన్నిహితుడు కావడం.. కాంగ్రెస్ వ్యూహంలో కీలకమైన పేరుగా వినిపిస్తుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేతగా పేరున్నప్రేమ్ సాగర్ రావు (వెలమ)– వెలమ వర్గానికి మంత్రి పదవి ఖరారుచేసే అవకాశం ఉంది. అయితే ఎస్సీ కోటాలో గడ్డం వివేక్ (ఎస్సీ మాల) పేరు ఖరారైందని సమాచారం. ఆర్థికంగా బలంగా ఉన్న వివేక్ ను తీసుకుంటే రాబోయే ఎన్నికల నాటికి ఉపయోగమని అధిష్టానం భావన. ఎస్ సి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో మాలలను సంతృప్తి పరిచేందుకు వివేక్ ఇస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో మొదటి నుంచి మాల వర్గం వారు ప్రభావిత వర్గంగా ఉన్నారు.
ఇప్పటికే కాబినెట్ లో ఉన్న పన్నెండు మంది మంత్రులలో రెడ్డి సామాజిక వర్గం నుండి –నలుగురు,బీసీ వర్గం నుండి ఇద్దరు, ఎస్సీ వర్గం నుండి ఇద్దరు ఎస్టీ వర్గం నుండి ఒకరు,మిగతా ముగ్గురు ఇతర సామాజిక వర్గాల నుండి ఉన్నారు. కాంగ్రెస్ నుండి ముస్లిం ఎమ్మెల్యే లు ఒక్కరు కూడా గెలవకపోవడంతో ముస్లిం మైనారిటీలు ఎవరు మంత్రులుగా లేరు. మంత్రివర్గంలో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో కాంగ్రెస్ వ్యూహంలో ముస్లిం వర్గానికి ఒక మంత్రి పదవి ఖాయమని సమాచారం ఉంది.
ఇక తెలంగాణ మంత్రివర్గంలో బీసి మహిళా మంత్రుల సంఖ్య తక్కువగా ఉంది. కొండా సురేఖతో పాటు ఎస్టీ కోటా లో సీతక్క మంత్రిగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సినీ నటి విజయశాంతికి బీసీ కోటా లో మరో మహిళా మంత్రిగా పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
మొత్తంగా, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కేవలం పదవుల పంపిణీ కాదని, రాబోయే ఎన్నికల వ్యూహానికి కీలకం అని స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఎవరెవరు మంత్రులు అవుతారు?ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కుతుంది?, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
ఈ దఫా మంత్రివర్గ విస్తరణ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.