34.1 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

యువత జీవితాల్లో మార్పుకే రాజీవ్ యువ వికాస పథకం – డిప్యూటీ సీఎం భట్టి

  • పథకం విజయవంతానికి అధికారులు అంకితభావంతో, పవిత్ర యజ్ఞంలా పనిచేయాలి

  • రాజీవ్ యువ వికాస పథకానికి  నిధుల సమస్య లేదు

  • జూన్ 2 నుంచి స్వయం ఉపాధి పథకాల మంజూరి పత్రాలు

  • మధ్య దళారీల పైరవీలను ఎక్కడికక్కడ కట్టడి చేయండి

  • ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష

  • హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం ద్వారా యువత జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం అధికారులు అంకితభావంతో పని చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్దేశించారు. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రాజీవ్ యువ వికాస పథకం అమలు గురించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 59 వేల మంది పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, ఉద్యోగాలు రానటువంటి యువత వారి కాళ్ళ మీద వారు ఆర్థికంగా నిలబడటానికి రాజీవ్ యువ వికాస పథకం ద్వారా స్వయం ఉపాధి పథకాలు అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా  అమలు చేయడానికి అధికారులు చాలా నిబద్ధతతో, పవిత్ర యజ్ఞంలా పనిచేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభించడానికి ముందే వనరుల సమీకరణకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకున్నామని, ఈ పథకానికి నిధుల సమస్య కూడా లేదని ఈ సందర్భంగా వివరించారు.

రాజీవ్ యువ వికాస పథకంలో లబ్ధిదారుడికి మంజూరి పత్రం అందజేసినప్పటి నుంచి  ఎంపిక చేసుకున్న యూనిట్ ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో స్థిర పడేంత వరకు కావలసిన సహకారాన్ని అందిస్తూ   యువత జీవన ప్రమాణాలు పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. బ్యాంకు మార్జిన్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం 9వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నదని, ఈ డబ్బులతో యువత వారి కాళ్ళ మీద వారు నిలబడి తమదైన శైలిలో వ్యాపారంలో రాణించి అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వంద శాతం అమలు చేసే విధంగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ శాఖలను సమన్వయం చేస్తూ ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి రాజీవ్ యువ వికాస్ మిషన్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మిషన్ బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగిస్తున్నట్లు చెప్పారు.

అదేవిధంగా శాఖల వారీగా ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించడానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియామకం చేయాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న ముందస్తు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 5లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసి ఏప్రిల్ 6 నుంచి మూడు వారాల్లో మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు స్క్రూట్ ని చేయాలని చెప్పారు. ఆ తర్వాత లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ కు మండల అధికారులు పంపించాలన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ వారం రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతి కోసం పంపించి అప్రూవల్ వచ్చిన తర్వాత లబ్ధిదారులను ప్రకటించాలన్నారు. జూన్ రెండు నాడు స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరి పత్రాలను అందజేయాలన్నారు.

జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలను నియోజకవర్గాల్లో పంపిణీ చేయాలని చెప్పారు. ఆ తర్వాత లబ్ధిదారులకు వ్యాపార మెలకువలకు సంబంధించిన  నైపుణ్యం అందించడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా మధ్య దళారీల పైరవీలు లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయాలని, లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా ఉండాలని సూచించారు.  నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో వుంది శాతం అమలు కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ఉన్నత అధికారులు ఈ శ్రీధర్, శరత్, శ్రీధర్, దివ్య దేవరాజన్, తఫ్సీర్ ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com