క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. స్టేడియాల్లో పరుగుల వరద పారించేందుకు బ్యాటర్లు.. వికెట్ల వీరులుగా మారేందుకు బౌలర్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే 17 సీజన్లు అలరించిన ఐపీఎల్.. ఇప్పుడు 18వ సీజన్‌లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఏ మాత్రం తగ్గదన్నట్టుగా రెడీ అవుతోంది.
కొల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. 2008 తర్వాత ఇరు జట్ల మధ్య సీజన్ తొలి మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. అయితే ఈ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారే చాన్సేస్ ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇక 18వ సీజన్ 65 రోజుల పాటు కొనసాగనుంది. మొత్తం 13 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 250కు పైగా స్కోర్లు 10 సార్లు నమోదైతే.. ఇందులో ఎనిమిది సార్లు 2024లోనే నమోదయ్యాయి. ఈసారి బ్యాటర్లు జోరు కొనసాగిస్తే తొలిసారి లీగ్‌లో 300 స్కోరు కూడా దాటే అవకాశం లేకపోలేదు.
ఈసారి ఐపీఎల్‌లో మరో హైలేట్ ఏంటంటే.. 7 టీమ్‌లకు ఒకే ఒక హోం గ్రౌండ్ ఉండగా… 3 టీమ్‌లు రెండు వేదికలను హోం గ్రౌండ్‌లుగా ఎంచుకున్నాయి. ఢిల్లీ తమ మ్యాచ్‌లను ఢిల్లీతోపాటు విశాఖపట్నంలో, పంజాబ్ తమ మ్యాచ్‌లను ముల్లన్‌పూర్‌తో పాటు ధర్మశాలలో, రాజస్తాన్ తమ మ్యాచ్‌లను జైపూర్‌తో పాటు గువాహటిలో ఆడనున్నాయి.
ఈసారి ఐపీఎల్‌లో కొన్ని రూల్స్ మారాయి. బంతిని షైన్ చేసేందుకు సలైవాను వాడేందుకు అనుమతినిచ్చారు. హైట్‌కు సంబంధించిన వైడ్‌లు, ఆఫ్ సైడ్ వైడ్‌లను తేల్చేందుకు కూడా డీఆర్‌ఎస్ సమయంలో హాక్ ఐని ఉపయోగించనున్నారు. స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్లపై జరిమానా వేయడాన్ని, సస్పెన్షన్ విధించడాన్ని తొలగించారు. దానికి బదులుగా డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు. అంతేకాదు రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఉందని భావిస్తే రెండో ఇన్నింగ్స్ సమయంలో 10 ఓవర్ల తర్వాత ఒక బంతిని మార్చేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అయితే బాల్‌ను మార్చడంపై తుది నిర్ణయం మాత్రం అంపైర్‌దే.