ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తలెత్తిన ఇబ్బందులు, ఎదురైన నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, రేపు కూడా ఇదే మాదిరిగా ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో, సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ముఖ్యంగా అకాల వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. వర్షాలు వచ్చిన తర్వాత హడావిడి పడే కంటే.. ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే సంబంధిత రెండు జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.