తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహించనున్న డీ లిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల వ్యూహానికి సంబంధించిన సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి రెండు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్లారు. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా చెన్నై వెళ్లారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ముందుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెన్నైకి చేరుకున్నారు. ఆయనకు చెన్నె విమానాశ్రయంలో తమిళనాడు కాంగ్రెస్ నాయకులు చిరంజీవులుతో పాటు.. పలువురు నేతలు స్వాగతం పలికారు.
ఇక, శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెన్నై వెళ్లారు. ఆయనతో పాటు.. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు కూడా చెన్నై వెళ్లారు.
వేర్వేరుగా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్, కేటీఆర్.. శనివారం ఉదయం జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశానికి హాజరవుతారు.