సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు ఈ రోజు (శుక్రవారం) బెయిల్ మంజూరు చేసింది. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై వివిధ సందర్భాల్లో పరుష పదజాలం ఉపయోగించి వ్యాఖ్యలు చేశారని గత ఏడాది కేసు నమోదైంది. తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మొదట ఫిర్యాదు చేయగా ఆ తర్వాత పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 26వ తేదీన పోసాని కృష్ణ మురళీని పోలీసులు అరెస్టు చేశారు.
ఈనెల 23 వరకు రిమాండ్ విధించగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత మళ్లీ కస్టడీకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈలోపే గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.