బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ఏపీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రత, ఆలయ పరిరక్షణలో ఏదైనా అవాంఛనీయ సంఘటన ఎదురైతే ఎలా స్పందించాలన్న అంశాలే ప్రధానంగా బుధవారం అర్దరాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు ఈ మాక్‌డ్రిల్ చేపట్టారు.
అసాంఘిక శక్తులు మెట్ల మార్గం నుండి ఇంద్రకీలాద్రికి చేరుకున్నట్లు, ఆ సమాచారం ఆలయ అధికారులు, వన్‌టౌన్ పోలీసుల నుండి అందుకున్న ఆక్టోపస్ విభాగం అధికారులు, సిబ్బంది ముందుగా జమ్మిదొడ్డి సమావేశం హాల్‌లో దేవస్థానం, పోలీస్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో చర్చించారు. ఆ తర్వాత దేవస్థానం మ్యాప్ ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందించి, ఇంద్రకీలాద్రికి సాయుధ కమెండోలు చేరుకున్నారు. సాహసోపేతంగా దుండగుల వద్ద ఉన్న పేలుడు సామాగ్రి, ఆయుధాలను నిర్వీర్యం చేశారు. వారిని అదుపులోకి తీసుకొని భక్తులను రక్షించారు. ఇదంతా సీన్ క్రియేట్ చేసి.. అమలు చేసి ఏదైనా అనుకోని ఎటాక్ జరిగితే ఎలా పరిష్కారం చూపించాలన్నది ప్రత్యక్షంగా చూపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలయ సిబ్బంది, స్థానిక పోలీసులు,సెక్యూరిటీ, వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఎలా వ్యవహరించాలనేది క్లియర్‌గా వివరించారు.
ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ రాజారెడ్డి, ఆక్టోపస్ డీ ఎస్పీ తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ మాక్ డ్రిల్ అవగాహన కార్యక్రమంలో .. దేవస్థానం అధికారులు, వన్ టౌన్ పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.