గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలక అధికారిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆమెకు నోటీసులు కూడా జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు నోటీసులు ఇచ్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సిద్ధమయ్యింది.యూనివర్సిటీ అధికారులు ఈమేరకు సమాలోచనలు చేస్తున్నారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిట్‌లో స్మితా సభర్వాల్ వాహన అద్దె అంశం బయటకు వచ్చింది. తన కారుకు సంబంధించిన అద్దె చెల్లింపుల బిల్లులు యూనివర్సిటీకి పంపించి.. స్మితా సభర్వాల్ ఆ బిల్లులు డ్రా చేసుకున్నట్లు ఆడిట్‌లో తేలింది. ఏకంగా కారు అద్దె పేరుతో యూనివర్శిటీ ఖజానా నుంచి రూ.61 లక్షలు బిల్లులు పెట్టి డ్రా చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అగ్రికల్చర్ యూనివర్శిటీలో నిధుల దుర్విని యోగం, అక్రమాలకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఈ విచారణలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు రూ.61 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు అధికారులు.
ఇలా తాను ఉపయోగించిన వాహనం అద్దె కింద తీసుకున్న రూ.61 లక్షలను తిరిగి చెల్లించాలని స్మితా సభర్వాల్‌కు అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2016 నుంచి 2024 వరకు సీఎంవో అదనపు కార్యదర్శిగా పనిచేశారు స్మితా సబర్వాల్. ఆ మధ్య కాలంలో 90 నెలలకు గాను వాహనం అద్దె కింద రూ.61 లక్షలు తీసుకున్నారు. ఈ నిధులపై ఆడిట్ విభాగం అభ్యంతం వ్యక్తం చేసింది. న్యాయ నిపుణుల సూచనల మేరకు ఆమెపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పైగా.. స్మితా సభర్వాల్ తీసుకున్న కారు నెంబర్ టీఎస్ 08 ఈసీ 6345. ఈ వాహనం నాన్ టాక్స్ కాదు. ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదు. ఈ వాహనం ప్రైవేటు వ్యక్తిగత వాహనం. పవన్‌కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో తేలింది. సీఎంవోలో ఉన్న సమయంలో స్మితా సభర్వాల్ ఆఫీసు నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావడంతో యూనివర్సిటీ అధికారులు డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పని తీరుపై తీవ్రమైన విమర్శలు రావడంతో ఇటీవల విచారణ జరిపించారు. ఈ విచారణలో పలు అవకతవకలు జరిగినట్టు బయటపడ్డాయి. వాటిలో స్మిత సభర్వాల్ అద్దె కారు వ్యవహారం కూడా ఉంది. స్మితా సభర్వాల్ నెలకు రూ.63 వేలు చొప్పున వాహన అలవెన్స్ తీసుకున్నట్లు అడిట్ అధికారులు గుర్తించారు. యూనివర్శిటీ ఖాతా నుంచి వెహికల్ అలవెన్స్ కింద మొత్తం 90 నెలలకు గానూ.. రూ.61 లక్షలు తీసుకోవడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ వాహనం అద్దెకు సంబంధించి ఆడిట్ విభాగం అభ్యంతరం చెప్పడం వాస్తవమేనని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలిపారు. ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ జరిపించామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ఇప్పటికే విశ్వవిద్యాలయం పాలకవర్గం దృష్టికి వచ్చిందన్నారు. సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించామని వీసీ తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వ విద్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక అందించనున్నారు. ప్రభుత్వం, న్యాయ నిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.