25.2 C
Hyderabad
Friday, September 18, 2026

Live Video

spot_img

వెండితెర అందగాడు శోభన్ బాబు

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతి రావు. జనవరి 14, 1937న శోభన్ బాబు కృష్ణా జిల్లా కుంటముక్కల గ్రామంలో ఉప్పు రామతులశమ్మ, సూర్యనారాయణ దంపతులకు జన్మించారు. వారిది మధ్యతరగతి కుటుంబం. శోభన్ ఇంటికి పెద్దవాడు కాగా అతనికి తమ్ముడు సాంబశివరావు, చెల్లెళ్ళు ధనరంగ, ఝాన్సి, నిర్మల వున్నారు. శోభన్ ప్రాధమిక విద్య కుంటముక్కలలో పూర్తిచేసి హైస్కూలు చదువు మైలవరంలో కొనసాగించారు. హైస్కూలు వార్షికోత్సవాలలో నాటకాలు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. విజయవాడలో ఇంటర్మీడియట్ చదివి గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బియ్యస్సి డిగ్రీ పూర్తి చేశారు. అక్కడ ‘పునర్జన్మ’ వంటి నాటకాలలో ప్రధానపాత్రలు పోషించి అనతికాలం లోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

శోభన్ బాబుకు సినిమాలంటే చాలాఇష్టం. తిరువూరులో తొలిసారి ‘కీలుగుఱ్ఱం’ సినిమా చూసి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. దేవదాసు, పాతాళభైరవి, మల్లీశ్వరి సినిమాలను బాగా అభిమానించేవారు. మల్లీశ్వరి సినిమాని ఇరవై సార్లకు పైగా చూశారట. 21 ఏళ్ళకే అంటే మే 1958లో శోభన్ బాబుకి శాంతకుమారితో పెళ్లయింది. ఆలిఘర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివేందుకు ఏర్పాట్లు పూర్తయినా న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకొని మద్రాసు బయలుదేరారు. కోడంబాకం లిబర్టీ దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. అయితే మద్రాసు వచ్చింది శోభన్ ‘లా’ కోర్సు చదవడానికి కాదు. ఆ మిషతో కాలేజీలో చేరి సినిమాలో అవకాశాలు వెతుక్కుందామని.

సెంట్రల్ స్టేషన్ కు దగ్గరలో ఎస్పలనేడ్ వద్ద వుండే ‘లా’ కాలేజిలో శోభన్ కి అడ్మిషన్ దొరికింది. రోజూ పది కిలోమీటర్లు సైకిలు తొక్కుకుంటూ కాలేజికి వెళ్లి నాలుగైదు గంటలు క్లాసులకు హాజరై భోజనం వేళకు తిరిగివచ్చేవారు. శ్రీమతి వంట రుచిచూసి మరలా సైకిలు మీద భరణి, వీనస్, విక్రమ్, వాహిని, ఏవియం, గోల్డెన్ స్టూడియోల చుట్టూ తిరుగుతూ కనపడిన నిర్మాతను, దర్శకుణ్ణి కలిసి ఫోటోలు యిచ్చి సినిమాల్లో నటించే అవకాశాలు ఇమ్మని అడుగుతూ కాలం గడిపేవారు. ఈ అభ్యాసం నిత్యకృత్యమైపోయింది. తిరగటం కష్టమై పోవడంతో స్తూడియోలకు దగ్గరగా వుండే కోడంబాకం వద్దకు మకాం మార్చారు. శోభన్ కు సినిమాల్లో చేరడం మీద శ్రద్ధ వుందని తండ్రికి చూచాయగా తెలిసింది. అవకాశాలకోసం ప్రయత్నించామని ప్రోత్సహించారు.

1967లో 10 సినిమాల్లో, 1968లో 9 సినిమాల్లో శోభన్ నటించారు. ఇక 1969లో శోభన్ బాబు 12 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డి నిర్మించిన చివరి చిత్రం ‘బంగారు పంజరం’ లో నటించడం ఒక మధురానుభూతి అంటుండేవారు శోభన్ బాబు. “ఏ మల్లీశ్వరి సినిమాను ఇరవై సార్లకు పైగా చూశానో, ఆ మల్లీశ్వరిని అందించిన మహనీయుని వద్ద పనిచేయడం కన్నా వేరే అదృష్టమేముంటుంది” అని స్నేహితుల దగ్గర చెప్పుకుంటూ మురిసిపోయేవారు శోభన్. అయితే వాణిశ్రీ-శోభన్ జంటను ప్రేక్షకులు అప్పట్లో ఆదరించలేదు. కారణం ఆ పాత్రలు సావిత్రి-నాగేశ్వరరావు పోషించాల్సినవని భావించడమే. తరవాతి కాలంలో శోభన్ బాబు-వాణిశ్రీ జంట ఎంత హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుందో చెప్పాల్సిన పనిలేదు. జెమినీ వారు మలయాళంలో హిట్టయిన ‘తులాబారం’ చిత్రాన్ని తెలుగులో ‘మనుషులు మారాలి’ పేరుతో నిర్మిస్తూ శోభన్ బాబుని హీరోగా తీసుకున్నారు. రజతోత్సవం చేసుకున్న ఆ చిత్రంలో శోభన్ కు మంచి పేరొచ్చింది.

దాంతో శోభన్ కు స్టార్ వాల్యూ వచ్చింది. ఆ సినిమాకు కె.రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి సహాయ దర్శకులుగా వి. మధుసూదనరావు వద్ద పనిచేశారు. వారితో శోభన్ స్నేహాన్ని పెంచుకున్నారు. తదనంతర కాలంలో విజయవంతమైన దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారిద్దరూ శోభన్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చారో తెలిసిందే. శోభన్ బాబుకి మరో బ్రేక్ ఇచ్చిన చిత్రం నవతా కృష్ణంరాజు నిర్మించిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’. చిన్నప్పటినుండి ఎవరినైతే తన అభిమాన నటిగా ఆరాధించారో ఆ ‘జమున’ ఈ చిత్రంలో శోభన్ సరసన నటించింది. అందులో శోభన్ ది తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయం. తరవాత వచ్చినవన్నీ ఛాలంజింగ్ పాత్రలే. నటుడు బాలయ్య నిర్మించిన ‘చెల్లెలి కాపురం’, బాపు నిర్మించిన ‘సంపూర్ణ రామాయణం’, ఉషశ్రీ చిన్నపరెడ్డి నిర్మించిన ‘మానవుడు దానవుడు’ చిత్రాలు వేటికవే సాటి. మానవుడు-దానవుడులో ఒక పాత్రలో నిస్వార్ధంగా సేవచేసే డాక్టరు, మరో పాత్రలో కరడుగట్టిన కిరాయి హంతకుడుగా ఈ రెండు పాత్రల్ని సమర్ధవంతంగా పోషించారు శోభన్. ఈ చిత్ర సంచలన విజయంతో శోభన్ పారితోషికం ఎనిమిది రెట్లు పెరిగింది. అలాంటి చిత్రాలే వరస విజయాలను తెచ్చిపెట్టిన ‘కాలం మారింది’, ‘జీవనతరంగాలు’, ‘శారద’, ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’, ‘డాక్టరు బాబు’, ‘కన్నవారి కలలు’, ‘గంగ-మంగ’, ‘జీవితం’, ‘ఖైదీ బాబాయి’, ‘దేవాలయం’, ‘దేవత’, ‘కార్తిక దీపం’, ‘మల్లెపూవు’.. మరెన్నో. ఇక శోభన్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

జయలలితతో అనుబంధం….

జయలలితను ‘డాక్టర్ బాబు’ సినిమాలో నటింపజేసేందుకు తమ్మారెడ్డి కృష్ణమూర్తిని, లెనిన్ బాబు ని ఒప్పించింది శోభన్ బాబే. శోభన్ బాబు అంటే జయలలితకు అపారమైన ప్రేమ. అందులో తప్పులేదు. కానీ పెళ్లి, పిల్లలు వున్న వ్యక్తిని తన దారికి తెచ్చుకోవడం మాత్రం బాగాలేదని పత్రికలు ఘోషించాయి. జయలలిత శోభన్ బాబుని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది కూడా. అయితే శోభన్ బాబు ఆ ప్రతిపాదనను సున్నితంగా త్రోసిపుచ్చారు. కట్టుకున్న భార్యకు, పిల్లలకు అన్యాయం చేయలేనని తన అసక్తతను వ్యక్తం చేశారు. అయితే వారిద్దరిమధ్య వివాహేతర సంబంధాలు కొనసాగుతూనే ఉండేవి. కానీ జయలలిత తన ప్రయత్నాలు మానుకోలేదు. చివరికి శోభన్ బాబు ఆమెనుండి దూరం జరిగారు. దాంతో జయలలిత పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిణిగానే ఉండిపోయింది. అయితే మరో కథనం కూడా వార్తల్లో వుంది. వీరిద్దరూ పెళ్ళికి సిద్ధపడ్డారని, అయితే జయలలితతో పార్టీపరంగాను, వ్యక్తిగతంగాను సన్నిహిత సంబంధాలు కలిగిన నాటి ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ పెళ్లి ప్రయత్నాలను అడ్డుకొని ఆపుచేయించారనేది ఆ వదంతి. శోభన్ బాబు తరచూ జయలలితను కలుసుకునేందుకు పోయస్ గార్డన్ వెళ్లడాన్ని శోభన్ బాబు భార్య తీవ్రంగా వ్యతిరేకించేదనే మాట వాస్తవం.

క్రమశిక్షణ కలిగిన జీవితానికి ప్రతీకగా నిలిచిన శోభన్ బాబు అరవయ్యోపడిలో పడగానే స్వచ్చందంగా నటజీవితానికి స్వస్తిచెప్పి అభిమానుల హృదయాల్లో హీరో ఇమేజితోనే తెరమరుగయ్యారు. మంచి ఆరోగ్యంతో వుండే శోభన్ తన జీవితకాలంలో ఆసుపత్రికి వెళ్ళడం కానీ, ఇంజక్షన్ తీసుకోవడం కానీ చేయలేదు. అయితే అకస్మాత్తుగా శోభన్ చెన్నై లోని తన ఇంటిలోనే 2008 మార్చి 20 న సహజ మరణాన్ని పొందారు. తను నటించిన రెండువందల పైచిలుకు చిత్రాలు శోభన్ బాబుని సోగ్గాడుగానే చూపించాయి. వార్ధక్య చాయలతో క్యారక్టర్ పాత్రలు చేసేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. నటనకు స్వస్తి చెప్పిన తరవాత తన ఫోటో కూడా బయటకు రానీకుండా చర్యలు తీసుకున్నారు. మనిషైతే మనముందు లేరుగానీ, పవిత్ర గోదావరి తీరాన రాజమహేంద్రవరంలో కాంస్య విగ్రహ రూపంలో ఆ సోగ్గాడు శోభనాద్రి రోజూ దర్శనమిస్తూనే వున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com