కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే, హైడ్రా వ్యవహార శైలిపై చాలా సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. హైడ్రా పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తోందని, డబ్బున్న బిల్డర్లను వదిలేసి కేవలం పేదల ఇండ్లను మాత్రమే కూల్చేస్తున్నారనే ఆరోపణలు భారీగా వచ్చాయి. ఈ అంశంపై చాలా మంది ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం కూడా పలు సందర్భాల్లో హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మండి పడింది.
పేదల నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని.. పెద్దల నిర్మాణాలను తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? అని కూడా నిలదీసింది. సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా? అని న్యాయస్థానం హైడ్రాను ప్రశ్నించింది. మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పేపర్లలో ఫొటోలు వేయించుకోవడం కాదని, సంపన్నులు ఉండే దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలను కూడా తొలగించాలని, అప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 6.10 ఎకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ స్థానిక ఎమ్మార్వో జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ షామ్స్ ఫాతిమాఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వక్ఫ్ బోర్డు సీఈవో రాసిన లేఖ ఆధారంగా వాల్టా చట్టం కింద ఎమ్మార్వో నోటీసులు జారీ చేయటం చెల్లదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది కలుగజేసుకొని.. మీరాలం చెరువు ఆక్రమణలపై ఇప్పటికే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైందని అన్నారు. ఆ పిటిషన్‌లోని ఉత్తర్వుల ప్రకారం సదరు సర్వే నెంబర్లలోని ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రెడ్డి స్పందిస్తూ.. ఒకప్పుడు హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్‌గా ఉండేదని.. అప్పుడు 2,200 చెరువులుటే ప్రస్తుతం 180 కూడా లేవని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెరువుల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటోందని.. కాకపోతే మురికివాడల్లోని పేదల అక్రమ నిర్మాణాలనే కాకుండా పెద్దలు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని సూచించింది. అప్పుడే ప్రజలకు మేలు చేసినట్లవుతుందన్నారు. మీరాలం చెరువుకు సంబంధించి పిటిషనర్ అభ్యంతరాలు లేవనెత్తగా.. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ భూమి వక్ఫ్‌బోర్డుదని తేలితే ఆక్రమణల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు కాకుండా వక్ఫ్‌బోర్డుకు వదిలేయాలంటూ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసేసింది.