ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన మర్మమేంటి? కేసీఆర్ పాపాల చిట్టా అంతా బయటపెడతారా? ఇది ఇంటర్వెల్ మాత్రమేనని 19, 20 తేదీల్లో జరిగే సమావేశాల్లో ఇంకా చెబుతానన్నారు రేవంత్ రెడ్డి. ఇక అప్పు వద్దు.. అప్పు చేసి పప్పుకూడా కూడా వద్దంటున్నారు ముఖ్యమంత్రి. ఆదాయం పెంచి పేదలకు పంచాలన్న ఆలోచనతోనే ఉన్నామని, అబద్ధాల పునాదులపై పాలన నడిపించ దలుచుకోలేదంటున్నారు. అంతేకాదు.. కౌంటర్ ఎటాక్ చేస్తానంటున్నారు. రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నారు. లెక్కలతో సహా వస్తానంటున్నారు. లెక్క తేల్చేస్తానంటున్నారు. సభలోనే తేల్చుకుందామంటున్నారు. నిజానిజాలు బయటపెడుదామంటున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో పాపాల చిట్టా విప్పుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఏం జరగ బోతోంది? కేసీఆర్ డెసిషన్స్‌ను, కార్యకలాపాలను ఎలా డీకోడ్ చేస్తారన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది.
ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే చాలా మంది అదే నిజం అనుకుంటారనేది నానుడి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వం ఇదే అభిప్రాయంతో ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. అసత్యాలను, అర్ధ సత్యాలను తిప్పికొట్టేందుకు మాస్టర్ ప్లాన్‌తో ఉంంటున్నారు. ఏ పని మొదలు పెట్టినా అందులో ఏదో ఒకటి తప్పు పట్టడం, తప్పు జరగకముందే జరుగుతాయని ప్రచారాలు చేయడాన్ని రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారంటున్నారు. ఇప్పటికే.. అసెంబ్లీ లోపలా, బయటా ఇదే ఇష్యూను ప్రస్తావిస్తున్నారు. అందరి లెక్కలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కలన్నీ సభలోనే తేల్చేస్తానని తెగేసి చెబుతున్నారు.
పంటలు ఎండిపోతున్నాయని, 15 నెలల్లోనే విపరీతంగా అప్పులు చేశారని, మూసీ పునరుజ్జీవం పేరుతో దోపిడీకి తెరలేపుతున్నారని, ఫ్యూచర్ సిటీ పేరుతో భూపందేరం నడుస్తోందని, ఒక్కటేమిటి.. ఇలా ఎన్నో అంశాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్, కొన్ని సోషల్ మీడియా నిర్వాహకులు విపరీతంగా ప్రచారాలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆధారాలతో సహా గుర్తించిందట. వీటికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నా.. ప్రతిపక్షానికి ఆ డోస్ సరిపోవడం లేదని అధికార పక్షం అనుకుంటోందంటున్నారు. ఉదాహరణకు సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం వల్లే రబీ సాగు పెరిగిందని, గత రబీకన్నా ఎక్కువ సాగు జరిగిందని వివరించాల్సిన పరిస్థితి నెలకొంది. రబీలో 35 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 55 లక్షల ఎకరాలు సాగు అయ్యిందని చెబుతున్నారు. ప్రతి ప్రశ్నకు, ఆరోపణలకు ఓపికగా సమాధానం, వివరణ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు అధికార పార్టీ నేతలు, మంత్రులు. అయితే, ఇలాగే వదిలేస్తే మ్యాటర్ చాలా దూరం వెళ్తుందనుకుంటున్న భావనకు వచ్చేశారు. అందుకే, అన్నిటికీ ఒకేసారి చెక్ పెట్టేలా రంగం రెడీ చేశారని చెబుతున్నారు.
వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయిలో బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంటుంది. సభలోపల, బయట చాలానే వర్క్ ఉంటుంది. ప్రజా సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు, సూచనలు చేయడం వంటివి ఉండాలి. కానీ, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్‌కే పరిమితమవుతున్నారు. ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావడం లేదు. ఇటీవల అసెంబ్లీకి ఒక్కరోజు హాజరై వెళ్లిపోయారు. అనర్హత వేటు పడకుండా జస్ట్ అటెండెన్స్ వేయించుకున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో లేటెస్ట్గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసన సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూనే కేసీఆర్ అసెంబ్లీకి గత 15 నెలల్లో కేవలం రెండు రోజులే వచ్చి అటెండెన్స్ వేయించుని వెళ్లారన్నారు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గడిచిన యేడాది కాలంలో ఇప్పటివరకు 57 లక్షల 84 వేల 124 రూపాయలు జీతభత్యాలు తీసుకున్నారని కూడా లెక్కలతో సహా చెబుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా పర్యటనలకు కూడా వెళ్లలేదని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట కూడా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో వర్క్ ఫ్రమ్ హోం, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ వంటిది ఏమైనా ఉందా? అని కూడా రేవంత్ కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించాలని హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలకు దూరంగా ఉండడం కరెక్ట్ కాదని, ఆయన్ను సభకు వచ్చేలా చూడాలంటూ ఇటీవలే ఓ పిటిషన్ దాఖలైంది. మరోవైపు.. 15 నెలల నుంచి కేసీఆర్‌కు ఇచ్చిన పదవిని సరిగ్గా నిర్వర్తించడం లేదని, ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని.. దాంతో ఇన్ని రోజులుగా ఆయనకు ఇచ్చిన జీతాలను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.
మరోవైపు.. అప్పులు భారీగా చేస్తున్నారన్న ప్రచారాలకు ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. అటు ప్రతిపక్ష నేత కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులపైనా కౌంటర్ ఇచ్చారు. మరి.. సీఎం ప్రకటించినట్లు ఈ రెండు రోజుల్లో అసెంబ్లీలో ఏం తేల్చబోతున్నారు? కేసీఆర్ ఆస్తుల లెక్కల్ని డీకోడ్ చేస్తారా? రేవంత్ బయటపెట్టబోయే కేసీఆర్ పాపాల చిట్టా ఏంటి? మొత్తానికి బీఆర్ఎస్ కౌంటర్లకు పుల్‌స్టాప్ పెట్టించడమే సీఎం రేవంత్ టార్గెట్ అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే, అది ఎలా పెట్టించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి చెల్లించిన వడ్డీలతో సహా లెక్కలు క్లియర్ కట్‌గా చెప్పేశారు. 2023 డిసెంబర్ 1వ తేదీ నాటికి రూ.6,69,257 కోట్ల అప్పులు, చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.40,154 కోట్లు, ఇతర పెండింగ్ బిల్లులు రూ.1,09,740 కోట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పులు రూ.8,19,151 కోట్లు అయ్యాయన్నారు. ఇక, తమ ప్రభుత్వం రూ.1,53,359 కోట్ల అప్పులు చేసిందని, ఇందులో కేసీఆర్ చేసి పెట్టిన అప్పుకు 15 నెలల్లో చెల్లించింది రూ.88,591 కోట్లు, ఆ అప్పుల వడ్డీలకు రూ64,768 వేల కోట్లు చెల్లించామన్నారు. ఇవన్నీ పోతే తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే అని రేవంత్ స్పష్టత ఇచ్చారు.
ఇక, ముఖ్యమంత్రి పదేపదే ఢిల్లీ వెళ్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. వాటికి కూడా రేవంత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 15 నెలల్లో 32 సార్లు ఢిల్లీకి వెళ్లి మూడుసార్లు ప్రధాన మంత్రిని కలవడాన్ని గుర్తు చేశారు. అంతేకాదు.. ఇలా ఢిల్లీ వెళ్లిన సమయాల్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమేం తీసుకొచ్చామో, ఏయే ప్రాజెక్టులకు అనుమతులు తెప్పించామో డీటెయిల్డ్‌గా అసెంబ్లీలో చెప్పేశారు. అటు ఫామ్ హౌస్‌లో క్యాప్సికం పండిస్తే ఎకరాకు కోటి రూపాయల ఆదాయం వస్తుంటే.. అదే ఫార్ములా రైతులు, యూత్‌కు చెప్పాలని సవాల్ చేస్తున్నారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, ప్రజలకు పంచాలనే ఆలోచనతో ఉన్నామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే.. పిక్చర్ అబీ బాకీ హై అంటున్నారు సీఎం. మరి.. ఆ పిక్చర్ ఏంటన్నది మరికొద్ది గంటల్లో బయటకు రానుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్కు ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారన్నది సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.