-
కొత్తగా పురమిత్ర యాప్
-
అందుబాటులో 150 పౌరసేవలు
ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి సర్కారు ప్రజలకు సేవలందించేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ అంటూ.. రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు పౌరసేవలను వాట్సప్‌లోనే అందజేస్తోంది. ఇప్పుడు కొత్తగా.. రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ కొత్తగా ‘పుర మిత్ర’ పేరుతో మరో యాప్ అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్జలు పౌర సేవలను ఈజీగా పొందేందుకు ఈ పురమిత్ర యాప్ ఉపయోగ పడుతుందని పురపాలక మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ యాప్‌తో ప్రజలకు సమయం ఆదా అవుతుందని అంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 95 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా పట్టణాల్లో ఉండే ప్రజలు.. పౌర సేవల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది.
అయితే, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సచివాలయాలు ఏర్పాటు చేసిన తరువాత, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే వారి శాతం చాలా వరకు తగ్గి పోయింది. ఏ అవసరం వచ్చినా తమ సచివాలయానికి వెళ్లి పని చేసుకునేవారు. ప్రజలకు అది చాలా ఉపశమనంగా ఉండేది. అయితే, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత డిజిటల్ సేవలను విస్తృతం చేసేందుకు సిద్ధపడింది. మరోవైపు.. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసింది. దీంతో, మున్సిపల్ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు తిరగాల్సిన పనిలేకుండా.. ఇంట్లో ఉండే అన్ని సేవలను పొందే విధంగా రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ‘పుర మిత్ర’ యాప్ ఇక నుంచి పౌర సేవలను అందిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో రూపొందించిన ఈ యాప్‌లో పలు సేవలు పొందవచ్చని పురపాలక శాఖ చెబుతోంది. ఏ సమస్య అయినా.. రోజుల వ్యవధిలోనే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఆయా సమస్యలను పేర్కొనేందుకు యాప్‌లో అవసరమైన ఫీచర్స్ కూడా పొందుపరిచారు. మన చుట్టూ ఉన్న సమస్యను కూడా ఫోటో తీసి, వాయిస్ రికార్డ్‌తో అక్షరాలను టైప్ చేసి పంపించే విధంగా పురమిత్ర యాప్‌ను తయారు చేశారు. ప్రజలు యాప్ ద్వారా పంపిన ఏదైనా సమస్యకు సంబంధించిన మెస్సేజ్ సంబంధిత విభాగానికి నేరుగా వెళ్లేలా రూపొందించారు. సమస్యను పరిష్కరించేందుకు కనీసం మూడు నుంచి 15 రోజులు, లేదా 30 రోజుల వ్యవధిగా నిర్ణయించారు. సమస్య తీవ్రతను బట్టి నిర్ణీత గడువు లోగా పరిష్కారం చేస్తారు. రెవెన్యూ, ప్రజారోగ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేటివ్ ఇలా 150 రకాల పౌర సేవలు “పుర మిత్ర” యాప్‌లో అందుబాటులో ఉంటాయి. పన్ను చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు వాటికి సంబంధించిన ఫీజులు చెల్లింపులు కూడా ఇందులోనే చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలో అయినా కంటికి కనిపించిన సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. కావాల్సిన సేవలను పొందవచ్చు. మనం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు ఆయా పట్టణాల్లో ఉన్న సమస్యను కూడా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉంది. ఆ సమస్య పరిష్కారానికి సంబంధించిన వివరాలు కూడా అధికారులు ఫిర్యాదు దారుకు తెలియజేస్తారు. సంబంధిత అధికారి గడువులోగా సమస్య పరిష్కరించాలి. పరిష్కారం అయిన ఫోటోను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు యాప్‌లో సమస్య పురోగతి తెలుసుకునేందుకు వీలు కల్పించారు. అధికారి స్పందించకపోతే, పై స్థాయి అధికారికి వెళ్తుంది. ‘పుర మిత్ర’ యాప్‌ను ప్లేస్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తెలుగులోనే ఉంటుంది. కాబట్టి యాప్ ఉపయోగించడం చాలా సులువు. ప్రతి ఒక్కరూ యాప్‌ను ఉపయోగించే విధంగా డిజైన్ చేశారు. అలాగే సమస్యల పరిష్కారాలపై అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు.