శ్రీరామ నవమి అనగానే గుర్తొచ్చేది భద్రాచలం. ఆ తర్వాత అందరికీ కావాల్సినవి భద్రాద్రి రామయ్య తలంబ్రాలు. అవి దొరికితే అదృష్టమే అన్న భావన భక్తుల్లో ఉంటుంది. అయితే, అలాంటి.. భద్రాచలం సీతా రామచంద్రుల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు నేరుగా చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. భద్రాచలం వెళ్లి స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్న వాళ్లకే కాకుండా.. ఇంట్లో నుంచి ఆ ఉత్సవాలను చూసిన వాళ్లకు, రామయ్య తలంబ్రాలు కావల్సిన వాళ్లకు చేర్చేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా టీజీఎస్ ఆర్టీసీ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగానే.. ఈ ఏడాది కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివరీ చేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.
రామయ్య తలంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలలో రూ.151 డబ్బులు చెల్లించవచ్చు.. లేదా.. టీజీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో కూడా రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణీకులకు, సీతారాముల భక్తులకు సూచనలు చేశారు. భద్రాచలంలో సీతా రామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు ఆర్టీసీ హోండెలివరీ చేస్తుంది. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు.. భద్రాచలంలో సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రాములోరి కల్యాణం కన్నులారా చూసేందుకు భద్రాద్రి వెళ్తుంటారు. సీతారాముల కల్యాణం వీక్షించిన అనంతరం తలాంబ్రాలు ఇంటికి తెచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఉత్సవాలకు వెళ్లని వాళ్లు కూడా అక్కడికి వెళ్లిన వాళ్లతో కనీసం తలంబ్రాలు అయినా తెప్పించుకుంటారు. అయితే, తెలిసిన వాళ్లెవరూ వెళ్లకున్నా రాములోరి కల్యాణ తలంబ్రాలు పొందేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ రాములోరి కల్యాణ తలంబ్రాలు హోం డెలివరీ చేస్తుంది.
హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించి.. తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. భద్రాచలంలో ఏప్రిల్ 6వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ కోరుతోందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-69440069, 040-69440000లో కూడా సంప్రదించవచ్చని సజ్జనార్ సూచించారు.