కారుణ్య నియామకాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో ఉంటూ మరణించిన వాళ్ల కుటుంబాలకు ఉపశమనం కలిగించింది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ దాదాపు 560 మంది అర్హులైన అభ్యర్థులకు కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తిని కోల్పోయిన కుటుంబాల దుస్థితిని వివరిస్తూ.. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి చాలా కాలం నుంచి విజ్ఞప్తులు చేస్తోంది. దీంతో, ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు జీవనోపాధిని కల్పించడానికి సూపర్ న్యూమరరీ పోస్టులను క్రియేట్ చేయాలని నిర్ణయించింది. దీంతో, కారుణ్య నియామకాల ప్రక్రియ సులభతరమైంది. తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ కారుణ్య నియామకాల నిర్ణయంపై ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించడం ద్వారా, మరణించిన ఉద్యోగుల కృషిని సర్కారు గుర్తించిందని కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సర్కారు తీసుకున్న కారుణ్య నియామకాల నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని చెబుతున్నారు.