తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం, చట్టరూపంలో తీసుకు రావడం కోసం యేడాది కాలంగా కసరత్తు చేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీలో బిసి బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని శాసనసభలో పెట్టిన తీర్మానాన్ని సాదరంగా స్వాగతిస్తూ, అభిమానిస్తూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలియ జేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన సర్వే జరిపించి జనాభా దామాషా ప్రకారం అన్ని వనరులు, ఇతరత్రా అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ఆదేశాలను పాటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మండలి కులగణన సర్వే కు శ్రీకారం చుట్టి 2024 ఫిబ్రవరిలో క్యాబినెట్లో తీర్మానం చేసి, అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేశాంమన్నారు. కులగణన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాస్త్రీయంగా పగడ్బందీగా 50 రోజుల్లో పూర్తి చేసిందని, కొంతమంది సర్వేలో పాల్గొనకపోవడంతో వారి కోసం రెండోసారి కూడా సభ్యుల కోరిక మేరకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ప్లానింగ్ శాఖ ద్వారా శాస్త్రీయంగా జరిగిన కులగణన సర్వేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్లానింగ్ శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రిగా తాను ప్రతిరోజు పర్యవేక్షించామని చెప్పారు. భారతదేశంలో కులగణన శాస్త్రీయంగా జరిగిందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కులగణన చేయాల్సిన సమయంలో మనం చేసిన సర్వేను రోల్ మోడల్‌గా తీసుకునేంత శాస్త్రీయంగా సర్వేను చేయించామన్నారు.
గతంలో కేంద్రానికి పంపిన అనేక తీర్మానాలు శాస్త్రీయంగా లేకపోవడం వల్ల కోర్టుల్లో వీగిపోయేవని, అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా సర్వే చేయించడంతో పాటు సర్వే సంఖ్యని కూడా అసెంబ్లీలో తీర్మానానికి పెట్టామని భట్టి విక్రమార్క చెప్పారు. శాస్త్రీయంగా జరిగిన కుల గణన సర్వేలో బీసీలు 50.36 శాతం ఉన్నారని, ఈ సంఖ్య ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సభలో తీర్మానాన్ని పెట్టామన్నారు. అసెంబ్లీలో చేసిన బీసీ తీర్మానాన్ని వచ్చే పార్లమెంటు తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి, బీసీలకు న్యాయం చేయాలన్న సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టే రాష్ట్రంలో కులగణన సర్వే చేయించి బీసీల లెక్కలు తేల్చి సభలో తీర్మానానికి పెట్టామని ప్రకటించారు. తెలంగాణలో కులగణన జరిగినట్టే దేశ వ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నామన్నారు. సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ బిల్లు తీర్మానాన్ని కేంద్రానికి పంపించడమే కాకుండా ఆ బిల్లు అమలు కోసం ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడి ఒప్పించడానికి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు.
అలాగే, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమయం తీసుకుని రాష్ట్రంలో ఉన్న అఖిలపక్ష పార్టీల నాయకులను ఢిల్లీకి తీసుకువెళ్లి 42 శాతం బిసి రిజర్వేషన్ అమలుకు ప్రధానమంత్రి మోదీని కలిసి పార్లమెంట్లో ఏకగ్రీవంగా బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఆహ్వానిస్తూ వారు చేసిన కృషిని అభినందిస్తూ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.