విదేశాంగ విధానంలో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు.. ఇది ముమ్మాటికి నిజం. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను చూస్తుంటే అర్థమయ్యే విషయం ఇదే. నిన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న అమెరికా, రష్యా మధ్య ఇప్పుడు దోస్తీ వికసిస్తోంది. అదే సమయంలో నిన్నటి వరకు భుజం, భుజం కలిపి కలిసి తిరిగిన రష్యా, చైనా దూరంగా జరుగుతున్నాయి.
చైనా ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనడం తగ్గించేసింది. కారణం అమెరికా విధించిన ఆంక్షలు. చైనాకు చెందిన రెండు సంస్థలు ప్రస్తుతం రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. మరో రెండు సంస్థలు దిగుమతి చేసుకునే పరిణామాన్ని తగ్గించేసుకున్నాయి.
దీనంతటికి కారణం బైడెన్ ప్రభుత్వం పోతూ పోతూ రష్యా చమురు ఉత్పత్తి సంస్థలపై ఆంక్షలు విధించి వెళ్లారు. అంతేకాదు రష్యా నౌకలకు ఇన్సూరెన్స్ అందించే కంపెనీలపై కూడా ఆంక్షలు విధించారు. అయితే వ్యూహాత్మకంగా వీటి ప్రస్తావన ఎత్తడం లేదు ట్రంప్. ఎందుకంటే ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ విషయాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది అమెరికా. ఒకవేళ ఒప్పందం కుదిరితే మాత్రం ఈ ఆంక్షలను సడలించే లేదా తొలగించే అవకాశం మాత్రం ఉంది.
అయితే అమెరికా విధించిన ఆంక్షలపై మాత్రం చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ఇక్కడో గమ్మతైన విషయం ఉంది. ఎప్పుడైతే చైనా ప్రభుత్వ కంపెనీలు చమురు దిగుమతిని తగ్గించడం.. నిలిపివేయడం చేశాయో.. కొన్ని ఇండిపెండెంట్ కంపెనీలు ఆ గ్యాప్‌ను పూడ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చైనా పైకి రష్యాకు దూరంగా జరుగుతుందన్నట్టు కనిపిస్తున్న తమ మిత్రదేశం కోసం పోరాడుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికి కూడా రష్యా నుంచే భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంటుంది చైనా.