ఏపీ మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. నల్లమల ప్రాంతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని అటవీ అధికారులు కూల్చివేశారు. నిరంతరం అన్నదానం జరిగే కట్టడాలు కూడా కూల్చివేసిన భవనాల్లో ఉన్నాయి. టైగర్ జోన్ ఏర్పాటు, అటవీ శాఖ నిబంధనల కారణంగా ఫారెస్ట్ అధికారులు నల్లమల అటవీ ప్రాంతంలోని కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చి వేశారు. అయితే, మంత్రి నారా లోకేష్ ఈ పరిణామంపై రెస్పాండ్ అయ్యారు. లోకేష్ క్షమాపణ చెప్పారు. ప్రజల మనోభావాలు, విజ్ఞప్తులను అధికారులు పరిగణన లోకి తీసుకొని ఉండాల్సింది నారా లోకేష్ అభిప్రాయ పడ్డారు. ఈ సంఘటనకు కారణమైన అటవీ అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి లోకేష్ ప్రకటించారు. అంతేకాదు.. అధికారులు కూల్చి వేసిన కట్టడాలని తిరిగి నిర్మిస్తామని భక్తులకు హామీ ఇచ్చారు.
మంత్రి నారా లోకేష్ ప్రకటన భక్తులకు ఊరట కలిగించిన మాట వాస్తవమే అయినా… ఆ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి చెందినది కావడం విశేషం. అటవీ శాఖ బాధ్యతలు ప్రస్తుతం పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్నారు. కాశీనాయన కట్టడాలని కూల్చేయొద్దంటూ పవన్ కళ్యాణ్‌కి ఇప్పటికే చాలా మంది నుంచి వినతులు అందాయి. కానీ, ఆయన మాత్రం స్పందించలేదు. ఇప్పుడు విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎంటర్ కావడంతో భక్తులకు ఊరట కలిగిందన్న చర్చ నడుస్తోంది. కానీ, ఇలా జనసేనకు చెందిన మంత్రిత్వ శాఖలో నారా లోకేష్ జోక్యం చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
గతంలో హోంశాఖ బాధ్యతలు టీడీపీ సరిగా నిర్వహించడం లేదంటూ హోం మంత్రి అనితను పవన్ కళ్యాణ్ బహిరంగంగానే విమర్శించిన ఘటన ఇంకా ఎవరూ మరిచిపోలేదు. తాను గనుక హోంశాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ, ఇలా వేరే మంత్రిత్వ శాఖ గురించి బహిరంగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు ఆయనకు సంబంధించిన శాఖలో నారా లోకేష్ జోక్యం చేసుకోవడంపై.. అది కూడా జనసేన ప్లీనరీకి ఒక్కరోజు ముందు ఈ పరిణామం జరగడంతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కానీ, ఇంత ముఖ్యమైన విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదనేది కాశీనాయన భక్తులకు అర్థం కావడం లేదు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా బెడుసుపల్లిలో 1895లో పుట్టిన కాశీ రెడ్డి బాల్యంలోనే ఆధ్యాత్మిక చింతనలో పడ్డారు. దేశంలోని అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించి కాశీ నాయనగా మారి పోయారు. ఆయన పేరు మీద రాష్ట్రంలో అనేక ఆశ్రమాలు వెలిశాయి. కడప జిల్లాలోని బద్వేలు సమీపంలో ఉన్న ఆశ్రమం అతి ముఖ్యమైనది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు తాను బతికి ఉండగానే చేశారు. కాశీ నాయన 104 ఏళ్ల వయస్సులో 1999లో దేహం చాలించారు. ఆయన పేరు మీద అప్పటి ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాయలసీమ ప్రాంతంలో కాశీనాయనకు ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు అటవీ శాఖ నిబంధనల పేరుతో ఆయన ఆశ్రమాన్ని, అన్నదాన సత్రాన్ని అటవీ అధికారులు కూల్చేయడంపై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం లోకేష్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ఆందోళన సద్దుమణిగినా.. అది పవన్ కళ్యాణ్‌కు చెందిన శాఖ కావడంతో జనసేన దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.