తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. తిరుపతి భవాని నగర్లోని తన ఇంట్లోనే ఆయన గుండెపోటుతో చనిపోయారు. సంగీత విద్వాంసుడైన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఎన్నో ఏళ్లుగా టీటీడీకి విశేష సేవలు అందించారు. అన్నమయ్య కీర్తనలను జనబాహుల్యంలోకి తీసుకెళ్లిన ప్రతిష్ట గరిమెళ్ళకే దక్కుతుంది. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు.
చంద్రబాబు ట్వీట్ :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుండి 2006 వరకు టిటిడిలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ 600 లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గొప్ప వ్యక్తి. సంప్రదాయ కర్ణాటక, జానపద, లలిత సంగీతంలోనూ ప్రావీణ్యత కలిగిన గరిమెళ్ల, తిరుమల శ్రీ వారి సేవలో తరించారు. తన మధుర గాత్రంతో శ్రీ వేంకటేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారు.. అలాంటి మహనీయుడు మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొంటు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
లోకేష్ సంతాపం :
సాంప్రదాయ కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతంలో తమదైన ముద్ర వేసిన శ్రీ గరిమెళ్ళ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాననని’ మంత్రి లోకేష్ సంతాపం తెలిపారు.
వైఎస్ జగన్ సంతాపం :
ప్రముఖ సంగీత విద్వాంసులు, శాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ గారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా శ్రీ బాలకృష్ణ ప్రసాదు అందించిన సేవలనుక జగన్ గుర్తు చేసుకున్నారు. సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలనకు స్వరకల్పన చేసి.. అన్నమాచార్యుల వారి సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన సేవలు వెలకట్టలేనివని అన్నారు.