-
స్టాలిన్ దక్షిణ భారత ఉద్యమం
-
తెలుగు రాష్ట్రాల ముఖ్యనేతలకు ఆహ్వానం
దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతోందంటూ ఉద్యమం మొదలెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో ముందడుగు వేశారు. ఈ ఉద్యమాన్ని లీడ్ చేసే బాధ్యత భుజానికెత్తుకున్నారు. ఒంటరిగా వెళ్తే అనుకున్న స్థాయిలో కేంద్రంపైనా, ఉత్తర భారత పెత్తనంపైనా పోరాటం చేయలేమనుకున్న స్టాలిన్.. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలిసి రావాలంటూ పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ భారత దేశానికి జరుగుతున్న అన్యాయంపై చర్చిద్దామని, పోరుబాటకు సంబంధించి రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుందామంటూ దక్షిణాది నాయకులకు స్టాలిన్ లేఖలు రాశారు.
ఇప్పటికే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తమిళనాడులో ఓ రేంజ్లో నడుపుతున్నారు స్టాలిన్. ఇప్పుడు దక్షిణ భారతానికి జరుగుతున్న అన్యాయంపైనా అందరినీ ఒకే వేదికపైకి తీసుకు రావాలని సంకల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాదిలోని రాష్ట్రాల కీలక నేతలందరికీ మీటింగ్ పెట్టుకుందామంటూ ఆహ్వానాలు పంపించారు. ఈ నెల 22వ తేదీన చెన్నై వేదికగా కలుసకుందామని లేఖలో పేర్కొన్నారు. కర్నాటక, కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు.. ప్రతిపక్ష నేతలకు కూడా స్వయంగా లేఖలు పంపించారు స్టాలిన్.
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనను స్టాలిన్ ఓ ఉద్యమ రూపంలో తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే దక్షిణ భారతానికి చెందిన చాలా మంది ముఖ్య నేతలు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నారు. అయితే, నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. కానీ, జనాభా ప్రాతిపదికనే డీ లిమిటేషన్ చేస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే.. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని దక్షిణాది రాష్ట్రాలు మొదటినుంచీ కుటుంబ నియంత్రణను ఓ ఉద్యమ స్థాయిలో అమలు చేశాయి. అయితే, కేంద్రం ఆదేశాలతో.. జనాభాను సమర్థంగా నియంత్రించినందున దక్షిణాది రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సింది పోయి.. పనిష్మెంట్ ఇస్తారా? అంటూ దక్షిణాది రాష్ట్రాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో నిధుల పరంగా కూడా అన్యాయం జరుగుతోందన్న వాదనలు ఉన్నాయి. ఈ పాయింట్లతోనే పోరాడాలని స్టాలిన్ నిర్ణయించినట్లు భావిస్తున్నారు. పై అంశాలే ఎజెండాగా దక్షిణాది రాష్ట్రాల భేటీ ఉంటుందని, ఈ భేటీలో పోరాట పంథాను ఖరారు చేసుకుందామని స్టాలిన్ పిలుపునిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలకు కూడా స్టాలిన్ ఆహ్వానాలు పంపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్‌కు.. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానాలు పంపించారు. ఇక, తెలంగాణలో మొన్నటిదాకా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా స్టాలిన్ విధానాలను సమర్థిస్తోంది. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని వాదిస్తోంది. ఈ క్రమంలో నే స్టాలిన్ భేటీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా స్టాలిన్ ఆహ్వానించారు. ఇండియా కూటమిలో స్టాలిన్ కీలక వ్యక్తి. దక్షిణాదికి అన్యాయం విషయంలో రేవంత్ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. అందుకే, రేవంత్ రెడ్డి హాజరవడం కూడా ఖాయమే అనుకునే పరిస్థితులున్నాయి. మరి.. రేవంత్ హాజరయితే కేసీఆర్ హాజరు కావడం అసాధ్యం. కేసీఆర్ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి హాజరవుతారా? లేదా? అన్నది సందిగ్ధం. దక్షిణాదికి అన్యాయం నిజమేనని వాదిస్తున్నప్పటికీ.. రేవంత్ రెడ్డితో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేదు కాబట్టి కేసీఆర్ హాజరు కాకపోవచ్చని భావిస్తున్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్టాలిన్ లేఖ రాశారు. చంద్రబాబు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపాదనలు వచ్చినప్పుడు దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటానని చెబుతున్నారు. ఈ కారణంగా ఆయన ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం దాదాపుగా లేదు. ఇక.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ అంశంపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలియదు. అయితే, ఆయన స్టాలిన్ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరైతే.. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారన్న చర్చ నడిచే అవకాశం ఉంది. అందుకే, వైఎస్ జగన్ కూడా సమావేశానికి హాజరు కాపోవచ్చని అంటున్నారు. కానీ, జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి కాబట్టి.. ఇప్పుడు జగన్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేమంటున్న చర్చ కూడా నడుస్తోంది.