ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచే పార్టీ కార్యక్రమాలు నడిపించనున్నారు. దాని కోసం విజయవాడలో ఇంటిని కొనుగోలు చేశారు. “ఆమె పూర్తిగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు క్యాడర్‌కు అందుబాటులో లేరు” అంటూ ప్రత్యర్థుల చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టారు. ఇకపై పూర్తిగా విజయవాడలోనే ఉంటూ రాజకీయాలు చేయబోతున్నారు. వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన నాటి నుంచి విజయవాడలో తగిన నివాసం కోసం వెతుకుతున్నారు.
ఆమె కుటుంబం నివాసం ఉండడంతోపాటు పార్టీ ముఖ్యలను కలిసేందుకు వీలుగా ఉండే ఇల్లు దొరకడం కష్టమైంది. చివరికి పోరంకి రోడ్లో కామినేని హాస్పిటల్ సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లాను షర్మిల కొనుగోలు చేశారు. సెక్యూరిటీ పరంగా ఇది ఎలాంటి ఇబ్బంది లేదని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేయనున్నారు షర్మిల. ఈ విల్లాను ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి కొన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై షర్మిల దృష్టి పెట్టారు. ఒకవైపు కూటమి, రెండోవైపు వైసీపీ ఉన్నప్పటికీ రెండూ కేంద్రంలో బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాయి. వాటికి ఒక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్‌ని బలోపేతం చేయాలనేది షర్మిల ఆలోచనగా ఉంది.