అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీనగరంలో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల భారతీయ విద్యార్థిని దుండగులు కాల్చి చంపారు. అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్‌గా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలానికి చెందిన ప్రవీణ్ మిల్వాకీ నగరంలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ మాస్టర్స్ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మిల్వాకీలోని తన నివాసానికి సమీపంలో ఉన్న బీచ్‌లో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రవీణ్‌ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ మిల్వాకీలోని ఓ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్ళాడు. దుండగుల కాల్పుల్లో ప్రవీణ్ మృతి చెందాడన్న సమాచరం అందడంతో అతని తల్లితండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రవీణ్ స్వగ్రామం కేశంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికా నుంచి ప్రవీణ్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకట్రెడు రోజుల్లో ప్రవీణ్ మృతదేహం అతని స్వగ్రామానికి చేర్చేలా తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. అయితే దుండగులు ప్రవీణ్‌పై కాల్పులు జరిపి హత్య చేయడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.