ఖలిస్థానీ వేర్పాటువాదుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. విదేశాల్లో మన దేశానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ భారత్‌ను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ కోవలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆయనపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ నెల 4న యూకే పర్యటకు వెళ్లిన జై శంకర్ ఐదు రోజుల పర్యటనలో భాగంగా 9వ తేదీ వరకూ అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. సమావేశం ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో కొందరు ఖలిస్థానీ అనుకూలవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలను ప్రదర్శిస్తూ భారత్, కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ గుంపులోని ఓ వ్యక్తి భారత జెండాను చేత పట్టి మంత్రి కారుకు అత్యంత సమీపంలోకి దూసుకొచ్చాడు. జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఖలిస్థాని అనుకూల వాదుల్లో పాకిస్థాన్ నుంచి వలస వచ్చి వివిధ దేశాల్లో స్థిరపడ్డ సిక్కులు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. మన దేశం నుంచి వలస వెళ్లి విదేశాల్లో స్థిరపడ్డ మూడోతరం యువత ఖలిస్థాన్ ఉద్యమానికి గట్టి మద్ధతుదారులుగా ఉన్నారు. వీరికి మన దేశానికి చెందిన వారు మద్ధతు ఇస్తున్నారని నిఘా వర్గాల సమాచారం. పంజాబీ మ్యూజిక్ అల్బమ్స్‌లో అధికంగా భారత్‌ను చాలెంజ్ చేసే విధంగా రూపొందిస్తున్నారని, ఇటీవలి కాలంలో ఈ పెడధోరణి అధికమైందని సమాచారం.
ఖలిస్థానీలకు పాకిస్థాన్ ప్రభుత్వం పరోక్షంగా మద్ధతు ఇస్తోందనేది బహిరంగ రహస్యం. మన దేశంలో ఇటీవల జరిగిన రైతు ఆందోళనల్లో ఖలిస్థానీ వేర్పాటువాదులే కీలక పాత్ర పోషించారని, భారత ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్ర చేశారని నిఘా వర్గాలు వెల్లడించాయి.