ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వివరించారు. అసెంబ్లీలో కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే అంకెల గారడీలు చెబుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. అసెంబ్లీని ఎందుకు నడుపుతున్నారని, తనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడ కూడదనే ఉద్దేశ్యంతోనే, తప్పులన్నీ బయట పడతాయన్న భయంతోనే ఐదు నిమిషాల్లోనే మైక్ కట్ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం బండారం బయట పడుతుందనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీలో బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రభుత్వం మోసాలను, తప్పుడు లెక్కలను ఎండగడతారన్న భయంతోనే హోదా విషయంలో సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నవారిని గుర్తించకుంటే.. ఎలా అని ప్రశ్నించారు. ప్రతి విషయంలో తాను నిజాలు చెప్పానని, ఎవరినీ తిట్టలేదని, తాను లేవనెత్తిన అంశాలపై, లెక్కలపై సమాధానాలు చెప్పాలనుకుంటే చెప్పాలని వైఎస్ జగన్ ప్రభుత్వానికి సూచించారు. ప్రజలందరికి అవగాహన కలగాలనే ఉద్దేశ్యంతోనే అసెంబ్లీలో చేయలేని ప్రతిపక్ష పాత్ర.. మీడియా ద్వారా చేస్తున్నామని చెప్పారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు తాము ప్రతిపక్ష హోదా ఇచ్చామని గుర్తు చేశారు. ఎక్కడా రూలింగ్ లేదని, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని రూలింగ్ ఎక్కడా లేదన్నారు. ఢిల్లీలో బీజేపీకి మూడు స్థానాలు ఉన్నా.. ఆప్ ప్రభుత్వం బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిందన్నారు. టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కన కూర్చున్నా.. విపక్ష హోదా ఇచ్చామన్నారు. ఇంకా పదిమందిని లాగుతామన్నా.. వద్దు అని తాను చెప్పానన్నారు. అసెంబ్లీలో ఏం మాట్లాడుతావో మాట్లాడు.. నేను వింటా అని ఆనాడు చంద్రబాబుకు మైక్ ఇచ్చామన్నారు.ఇప్పుడు అసెంబ్లీ ఎందుకు నడుపుతున్నారు? వైఎస్‌ఆర్ సీపీ కాకుండా ప్రతిపక్ష పార్టీలు ఏవైనా ఉన్నాయా? మీరే రూలింగ్‌లో ఉన్నారు. ఎలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. డబుల్ యాక్షనా? ఇదేమన్నా సినిమానా?
అసెంబ్లీలో రెండే రెండు పార్టీలున్నాయి. కూటమి కట్టి వారు అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంగా మాకే ఆ హోదా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ద హౌజ్‌కు ఎంత సేపు మైక్ ఇస్తారో.. ప్రతిపక్ష నేతకు కూడా అంతే టైమ్ ఇవ్వాలి. కానీ, నేను ఎవరి స్వరం వినను. ఐదు నిమిషాలకు మించి ఇవ్వం.. అని చెబితే ఎలా?
నిజాలు చెప్పాలంటే టైమ్ పడుతుంది కదా? వినాలి.. మైక్ ఇస్తేనే కదా అన్నీ జనానికి తెలిసేది.. అని వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.