26.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

చంద్రబాబు ఎవరెవరికి ఎంత బాకీ పడ్డారంటే…?

  • లెక్కలతో వివరించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

  • బడ్జెట్‌ అంతా అంకెల గారడీ అని ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు నీటి మూటలుగా మారుతున్నాయని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 అంటే యేడాదికి రూ.18వేలు ఇస్తామని చెప్పారు.. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు.. ఆడ బిడ్డ నిధి అని బ్రహ్మాండమైన పేరు పెట్టారు.. కానీ, ఆచరణలో మొండిచేయి చూపిస్తున్నారు.. అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.

ప్రతి మహిళకూ రూ.36వేలు బాకీ :
ఓటరు లిస్ట్‌ ప్రకారం చూస్తే.. రాష్ట్రంలో 2 కోట్ల 7 లక్షల మంది మహిళలు ఓటేశారని, ఆ వివరాలు ఆధార్‌ కార్డులతో సహా ఉన్నాయన్నారు జగన్. వారిలో 60 యేళ్ల పైబడి వయసు ఉన్న వాళ్లను మినహాయిస్తే.. దాదాపు ఒక కోటి 80 లక్షల మంది మహిళలు ఉంటారని, వీరికి ఈ పథకం అమలు చేయాల్సి ఉంటుందన్నారు జగన్‌. బడ్జెట్‌లో ఆ నిధులేమయ్యాయని ప్రశ్నించారు. ఈ పథకం కింద.. యేడాదికి రూ.32,400 కోట్లు కేటాయించాలి. నిరుటి బడ్జెట్‌లో సున్నా కేటాయింపులు.. ఈ బడ్జెట్‌లో కూడా కేటాయింపులు సున్నా.. చంద్రబాబు పుణ్యాన.. గత ఏడాది రూ.18వేలు, ఈ ఏడాది రూ.18వేలు మొత్తంగా ప్రతి మహిళకు రూ.36వేలు చంద్రబాబు బాకీ పడ్డారని వైఎస్ జగన్‌ లెక్కలేశారు.

ప్రతి విద్యార్థికీ రూ.30వేలు బాకీ :

ఇక, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారని, ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం పథకం కింద ఈ మొత్తం జమ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, ఎన్నికల ప్రచారంలో ఊరూరా ఊదర గొట్టారని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యేడాది ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్‌లో రూ.5,386 కోట్లు కేటాయించినప్పటికీ.. లబ్దిదారులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కూ.13వేల కోట్లు అవసరమైతే.. రూ.9వేల కోట్లు మాత్రమే పెట్టారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఎలాగూ చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. యూడీఐఎస్‌సీ లెక్కల ప్రకారం చూస్తే.. మన రాష్ట్రానికి సంబంధించి 2023-24 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు 87,41,885 మంది ఉన్నారని, వారికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తే.. రూ.13,112 కోట్లు అవసరం అవుతుందని, కానీ, ఈ పథకం కోసం మొదటి సంవత్సరం రూ.5,386 కోట్లు రెండో సంవత్సరంలో రూ.8,278 కోట్లు ప్రకటించారన్నారు. అయితే, అదంతా పేపర్లలోనే కనిపిస్తుందని, ఎలాగూ ఇచ్చేది ఉండదని, మోసం చెయ్యడమే కాబట్టి.. ఏదో ఒక ఫిగర్ బడ్జెట్లో పెట్టేశారని దుయ్యబట్టారు. ఎగనామం పెట్టడంలో చంద్రబాబు చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ఇలా.. రాష్ట్రంలోని ప్రతి పిల్లాడికి చంద్రబాబు.. రూ.30 వేలు బాకీ పడ్డారని ఆరోపించారు.

ఉచిత బస్సు ప్రయాణం రూపంలో రూ.7వేల కోట్లు బాకీ :

ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా చిన్న హామీ అన్న వైఎస్‌ జగన్‌.. ఆ హామీని కూడా అమలు చెయ్యడం లేదని మండిపడ్డారు. మొదటి బడ్జెట్‌లో ఎలాగూ విస్మరించారు.. కనీసం రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా దీనికి సంబంధించిన ఆనవాళ్లు, కేటాయింపులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారని, మహిళలంతా ఉచితంగా ప్రయాణిస్తున్నారని, అలాగే..ఆంధ్రప్రదేశ్‌లో కూడా తోటి రాష్ట్రాల్లో మహిళల మాదిరిగా ఉచిత బస్సు ప్రయాణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే.. నెలకు రూ.275 కోట్లు అవసరమవుతాయని, సంవత్సరం అంతా కలిపితే రూ.3,500 కోట్లు కూడా కావన్నారు.

మహిళలకు అమరావతి చూపిస్తారా? :

రాయలసీమ వాసులు విశాఖ వెళ్దామని ఎదరు చూస్తున్నారని, ఉచిత బస్సు పెడితే చంద్రబాబు కడుతున్న అమరావతి చూడొచ్చని ఎదరు చూస్తున్నారని.. కానీ, చంద్రబాబు మాత్రం చిన్న హామీ విషయంలో కూడా తన నైజాన్ని చూపిస్తున్నాడన్నారు. ఇలా.. మహిళలకు ఉచిత బస్సు పథకం రూపంలో రూ.7వేల కోట్లు చంద్రబాబు బాకీ పడ్డాడని మాజీ సీఎం ధ్వజమెత్తారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com