32.6 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కొణిదెల నాగబాబు

ముందుగానే ప్రకటించేసిన పవన్‌ కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఐదు స్ధానాలకు జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున మొదటి అభ్యర్థిగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాలతో జనసేన మీడియా అడ్వైజర్‌  పిడుగు హరిప్రసాద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీలో జరగబోయే ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు సీట్లు అధికార కూటమి పార్టీలు ప్రతిపాదించిన అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే ఎన్నికలు జరగబోయే ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసే విషయంలో కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు అయితే తీవ్ర కసరత్తు చేస్తారు. అనేక సమావేశాలు నిర్వహించి సామాజిక, ప్రాంతీయ, వర్గ, కుల సమీకరణల వడపోత తరువాత అభ్యర్ధులను ప్రకటించడం చంద్రబాబుకు ఆనవాయితీ. అయితే ఈసారి అభ్యర్ధుల పంపకాలు కాకుండానే, ఎటువంటి కసరత్తులు జరగకుండా కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన జనసేన తమ అభ్యర్ధిని ప్రకటించడం రాజకీయ వర్గాలను కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు సైతం అనేక మంది తమ అసెంబ్లీ స్ధానాలను త్యాగాలు చేశారు. వారందరికీ భవిష్యత్తులో న్యాయం చేస్తానని చంద్రబాబు, లోకేష్‌లు హామీలు ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించకుండానే జనసేన తన అభ్యర్ధిని ప్రకటించింది.

ఒక నాగబాబు విషయానికి వస్తే 2024 ఎన్నికల సమయంలో ఆయనకు అనకాపల్లి పార్లమెంట్‌ స్ధానాన్ని జనసేన పార్టీ కేటాయించింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో ఆ సీటును బీజేపీ కోరింది. దీంతో అప్పటికే నియోజవర్గంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఎన్నికల కసరత్తు ప్రారంభించిన నాగబాబు ఆ సీటును త్యాగం చేశారు. ఆ సందర్భంలో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరిగినా మళ్ళీ పొత్తు ధర్మం పేరు చెప్పి నాగబాబుకు అవకాశం దక్కలేదు. అదే సందర్భంలో నాగబాబును త్వరలో మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్వయంగా చంద్రబాబునాయుడి పేరుతోనే ప్రకటన విడుదల చేశారు. ఈ పరిస్ధితుల్లో ఇప్పుడు జరగబోయే ఐదు ఎమ్మెల్సీ స్ధానాల్లో ఒక స్ధానం నుంచి నాగబాబును ఎంపిక చెయ్యాలనే డిమాండ్‌ అటు జనసేన నుంచే రావడం కాకుండా పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆదే అభిప్రాయంలో ఉన్నారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఒకటి తలిస్తే టీడీపీ మీడియా ఒకటి తలచినట్లు గత కొన్ని రోజులుగా విచిత్రమైన వార్తా కథనాలు ప్రచురించి జనసేలో వేడి పుట్టించారు. ఒక మీడియా సంస్ధ ఏమో నాగబాబును రాజ్యసభకు పంపుతారని, మరో టీడీపీ మీడియా సంస్ధ నాగబాబుని ఒక పెద్ద కార్పొరేషన్‌కి చైర్మన్‌ చెయ్యబోతున్నారని దీనికి పవన్‌ కళ్యాణ్‌ ఆమోదం కూడా ఉందని వార్తలు రాశారు. దీంతో ఈ సారి కూడా నాగబాబుకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని అటు కాపు సామాజికవర్గం నంచే కాక జనసేన శ్రేణుల నుంచి కూడా పవన్‌ కళ్యాణ్‌పై ఒత్తిడి పెరిగింది. ఎటొచ్చి ఏమవుతుందో అన్న ఆలోచనతో పవన్‌ కళ్యాణ్‌ ముందుగా తమ పార్టీ తరపున నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించేశారు.

అయితే ఇక్కడ టీడీపీకి ఇంకో చిక్కువచ్చి పడింది. ఇటీవల అనూహ్యంగా వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరి తిరిగి అదే స్ధానానికి ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికవుతారని ఢిల్లీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్రంలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. తమను నిత్యం విమర్శలతో తూర్పారబట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు బీజేపీ ఖాతాలో కూటమి అభ్యర్ధిగా రాజ్యసభకు పంపాల్సి వస్తే పరిస్ధితి ఏంటనే ఆందోళన టీడీపీ క్యాడర్‌లో నెలకొంది. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్‌లపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. అయితే నాగబాబును రాజ్యసభకు ప్రతిపాదించడం ద్వారా విజయసాయిరెడ్డిని అడ్డుకోవచ్చనే వ్యూహం ఒకటి టీడీపీలో రహస్యంగా నడుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ, టీడీపీ గేమ్‌ ప్లాన్ల మధ్య తాము ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న అవకాశాన్ని ఒదులు కోవడం సరకాదని జనసేన అభిప్రాయడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు జనసేన తనవాటా తాను తీసేసుకుని నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించేసింది.

కొణిదెల నాగబాబు ప్రకటనతో టీడీపీ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయ్యిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం వర్మకు ఇంకా ఎటువంటి పదవి ఇవ్వకుండా పవన్ అన్న నాగబాబును ఎమ్మెల్సీ చేస్తే టీడీపీ ఒక రకంగా ఇరుకున పడినట్లే అవుతుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు తప్పని సరిగా వర్మను కూడా ఎమ్మెల్సీ చేయ్యాల్సిన పరిస్ధితి టీడీపీ ఎదుర్కొంటోంది. ఓపక్క పదులు సంఖ్యలో సీనియర్ నేతలకు మాజీ మంత్రులకు చంద్రబాబు ఎమ్మెల్సీ తరహా పదవులు ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com