30.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

ఎమ్మెల్సీ సీట్లకు కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సందడి ముగుస్తుండగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరు ఎంపికవుతున్నారనే చర్చ మొదలైంది. తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. ఇందులో నాలుగు కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉండగా ఒకటి బీఆర్‌ఎస్‌కు పోతుంది.

కాంగ్రెస్‌లో ఆశావాహుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఖాయమని, ఎమ్మెల్సీ పదవితోపాటు మంత్రిపదవి కూడా ఇస్తారని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సీఎం సన్నిహితుడు కావడంతో ఎవరు కామెంట్‌ కూడా చేయటం లేదు. వేం నరేందర్‌ రెడ్డికి జిల్లా, సామాజిక వర్గం కోటా కూడా వర్తించదంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి రాకపోతే ఏకంగా రాజ్యసభకే పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని విశ్వసనీయ సమాచారం.

కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ ఎమ్మెల్సీ పదవి డిమాండ్‌ చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో టికెట్‌ కోల్పోయిన అద్దంకి…ఈ దఫా తనకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నాడు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ రెడ్డి దిగ్గజాలు NOC(no objection certificate) ఇస్తేనే అద్దంకి కోరిక నెరవేరుతుంది. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వటం రెడ్డి నేతలకు సుతారం ఇష్టం లేదు. శాసనసభ ఎన్నికల సమయంలో కూడా సీనియర్‌ నేతలు అడ్డుకోవడంతోనే అద్దంకి దయాకర్‌కు టికెట్‌ మిస్సయిందని అప్పట్లో టాక్‌. పార్టీ లైన్ మారకుండా ఉన్న అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చే దిశగా సీఎం రేవంత్‌ రెడ్డి వర్గం బలంగా ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది.

ఆకుల లలిత, సునితారావు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నా చిగురింత పారిజాత నర్సింహారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్స్‌న్‌ పారిజాతకు మహేశ్వరం టికెట్‌ చివరి క్షణంలో నిరాశ ఎదురైంది. కెఎల్‌ఆర్‌ పేరు ప్రకటించటంతో అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధిష్టానం దూతలు బుజ్జగించటంతో పారిజాత శాంతించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఎంపిగా పోటీ చేస్తానని పారిజాత డిమాండ్‌ చేయగా అధిష్టానం వారించింది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందేనని అంటున్నారు. పారిజాతకు ఇచ్చినా రెడ్డి సామాజిక వర్గం కాకుండా మహిళల కోటా నుంచి ఎంపిక చేస్తారని అంటున్నారు.

మహిళా కోటాలో బానోత్‌ విజయాబాయికి దక్కవచ్చని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  బీసీల నుంచి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఈరావత్రి అనీల్‌, గాలి వినోద్‌కుమార్‌, కైలాష్‌ నేత, చరణ్‌ కౌషిక్‌ యాదవ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వీరందరితోపాటు కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీభవన్‌ ఇంచార్జి కుమార్‌ రావు పేరు బలంగా వినపడుతోంది. 40 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న కుమార్‌ రావుకు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కలేదు. 70 ఏళ్ల కుమార్‌ రావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో పెరుగుతుందని అధిష్టానం సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

మూడు ఎమ్మెల్సీల్లో ఒకటి అద్దంకి దయాకర్ పోగా మిగిలిన రెండింటిలో..వేం నరేందర్‌రెడ్డి, బానోత్ విజయాబాయి, పారిజాత నర్సింహారెడ్డిలలో ఎవరికి అదృష్టం దక్కనుందనేది చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌ నేతలు టి జీవన్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ ఎమ్మెల్సీ పదవులు ఆశపడుతున్నా… శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి అవకాశం లేదని అధిష్టానం స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఢిల్లీ టూర్‌లో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టుపై అధిష్టానంతో చర్చించి, ఫైనల్‌ చేసుకువస్తారని రాష్ట్ర నేతలు భరోసాతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పార్టీలో ఎదురులేకున్నా అధిష్టానం మార్క్ ఏ విధంగా ఉంటుందో జాబితా విడుదలైతే కాని తేటతెల్లం అయ్యే అవకాశం లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com