26.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీళ్ళేనా…?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రా్ల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసిందో లేదో… కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల్లో మరో సారి ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈసారి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో ఎంపిక జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, బి.తిరుమలనాయుడు, దువ్వారపు రామారావులు మార్చి 29వ తేదీతో పదవీ విరమణ పొందుతున్నారు. వీరితో పాటు రాజీనామా చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్ధానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు ఎమ్మల్యే కోటా ఎమ్మల్సీ స్ధానాలకు ఈ నెల 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రానికి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అయితే ఐదు స్థనాలు అధికార కూటమికే దక్కనున్న నేపథ్యంలో పోటీ ఉండే పరిస్ధితి లేదు. 11వ తేదీ నామినేషన్ల పరిశీలన రోజే ఫలితాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువ. అయితే ఈ సారి కూటమి దక్కే ఈ ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు పోటీ పడే ఆశావాహుల జాబితా చాంతాడంత ఉంది. 2024 ఎన్నికల్లో అవకాశాలు కోల్పోయి త్యాగాలు చేసినవారికి ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చి ఉండటంతో చాలా మంది రేసులోకి వచ్చేశారు.

కూటమి పొత్తుల్లో భాగంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తమ స్ధానాలను త్యాగం చేసిన వారిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గత ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానం నుంచి గెలుపొందారు. ఇక పిఠాపురం నుంచి ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ, కేఎస్‌.జవహర్‌, పీతల సుజాత, దేవినేని ఉమ, కొమ్మాలపాటి శ్రీధర్‌, బీద రవిచంద్రయాదవ్‌, వంగవీటి రాధా తదితరులు మొదటి వరుసలో ఉన్నారు. వీరిలో పీతల సుజాతను ఎస్సీ కమీషన్‌ చైర్‌పర్సన్‌ పదవి కట్టబెట్టారు. దీంతో ఆమె ఆశావాహుల జాబితా నుంచి వైదొలిగినట్లే. ఇక పిఠాపురం స్ధానాన్ని పవన్‌ కళ్యాణ్‌ కోసం త్యాగం చేసిన వర్మ అందరికంటే జాబితాలో ముందు ఉన్నారు. ఈసారి పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు నాగబాబుకు కూడా ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో వర్మకు ఇవ్వకుండా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తే కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని అందువల్ల వర్మకు కూడా తప్పని సరిగా ఈ సారే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే ఆలోచనలో కూటమి అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఎస్సీ కోటను ఈ ఐదు ఎమ్మెల్సీ స్ధానాల్లో భర్తీ చేస్తే కొవ్వూరు సీటు వదులుకున్న కేఎస్‌.జవహర్‌కి తప్పనిసరిగా మండలిలో సీటు దక్కే ఛాన్స్‌ ఉంది. ఇక కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి దేవినేని ఉమ, కొమ్మాలపాటి శ్రీధర్‌లు ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. వీరిద్దరూ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు అవ్వడం వీరికి అడ్డంకిగా మారచ్చు. ఇప్పటికే గత నెల్లోనే జరిగిన పట్టభద్రుల స్ధానం నుంచి అదే కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గెలుపొందడంతో వీరిద్దరి దారులు మూసుకుపోయే పరిస్ధితి ఉంది. దానికి తోడు కొమ్మాలపాటి శ్రీధర్‌ని జిల్లా అధ్యక్షుడిని చేశారు. పైపెచ్చు ఆలపాటి రాజా కూడా గుంటూరు జిల్లాకే చెందిన వ్యక్తి కావడంతో శ్రీధర్‌కు దాదాపు అవకాశం లేనట్లే.

ఇక దేవినేని ఉమ విషయానికి వస్తే ఈయన మండలికి వస్తే జిల్లాలో ఎవరికి ఎక్కువ నష్టం అనే విషయంపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్‌లు ఇద్దరు ఉమ అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పటికే దేవినేని ఉమ ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి, పించన్లు పంపకాలకు తమ కంటే ముందు వాలిపోతున్నాడని ఎంపీ, ఎమ్మెల్యేలు ఉమ మీద ఆగ్రహంతో ఉన్నారు. పైగా వీరిద్దరు ప్రస్తుతం లోకేష్‌ కోటరీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ అభ్యర్థిత్వం ఎంతవరకూ పరిశీలనకు వస్తుందనేది సంశయమే. జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటే ఉమకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ బాబు, లోకేష్‌లకు వీరవిధేయుడు బుద్దా వెంకన్న పేరును ఎంపీ కేశినేని చిన్నీ తెరపైకి తెస్తున్నారు. ఒక వేళ అదీ కాకపోతే వంగవీటి రాధాపేరుని కూడా వీరిద్దరూ ప్రతిపాదించే అవకాశం ఉంది. అయితే కాపు సామాజికవర్గం నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తే రాధాను ఎంత వరకూ పరిగణలోకి తీసుకుంటారో చూడాలి. ఓపక్క సోషల్‌ మీడియాలో కమ్మ సామాజికవర్గానికి టీడీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ వర్గం యువకులు చెడుగుడు ఆడుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎంపిక చేసే ఎమ్మె్ల్సీ అభ్యర్ధుల విషయంలో ఈ అంశం కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

ఉన్న ఐదు స్ధానాల్లో ఒకటి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలనే ఆలోచన చేస్తే బీద రవిచంద్రయాదవ్‌, మోపిదేవి వెంకట రమణ, బిటీనాయుడల పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్ధానాల్లో యనమల రామకృష్ణుడిది ఒకటి. ఈ సారి యనమలకు కొనసాగింపు లేనట్లే అని ఇప్పటికే తేల్చి చెప్పేసినట్లు సమాచారం. దీంతో యాదవ వర్గాన్ని సమతుల్యం చెయ్యడానికి బీద రవిచంద్ర యాదవ్‌కు చాన్స్‌ దక్కచ్చు. వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించి ఆ స్ధానంలో తాను ఎంపికయ్యేలా చక్రం తిప్పిన లోకేష్‌ సన్నిహితుడు సానా సతీష్‌ అప్పట్లో మోపిదేవికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మోపిదేవికి ఇవ్వడం ద్వారా బీసీ కోటా భర్తీ చేసినట్లు ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వీరిద్దరూ కూడా కాకుండా వేరే బీసీ వ్యక్తిని ఎంపిక చేయాల్సి వస్తే బోయ సామాజికవర్గానికి చెందిన బీటీనాయుడ్నే కొనసాగించే అవకాశం ఉంది.

ఈ కరత్తు అంతా ఒకెత్తైతే ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమేతర సామాజికవర్గాలను సంతృప్తి పరచవల్సిన పరిస్ధితిని టీడీపీ ఎదుర్కొంటోంది. ఉత్తరాంధ్రలో ప్రిడామినెంట్ సామాజికవర్గాలైన తూర్పు కాపులు, కాళింగులకు టీడీపీలో ప్రాధాన్యత తగ్గందనే ఆసంతృప్తితో ఉన్నారు. కోన రవికుమార్‌, కిమిడి కళా వెంకట్రావులకు ఈ తడవ ప్రాధాన్యత తగ్గిందనే అభిప్రాయం ఉత్తరాంధ్రకు చెందిన తుర్పుకాపులు, కాళింగ సమాజికవర్గ ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానానికి జరిగిన ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్ధి ఓటమికి ఈ అసంతృప్తే కారణమనే వాదన రెండు రోజులుగా తెరపైకి వచ్చింది దీంతో ఈ సారి ఐదు ఎమ్మెల్సీ స్ధానాల్లో ఒక స్ధానం ఉత్తరాంధ్రకు అదీ తూర్పు కాపు, కాళింగ సామాజికవర్గాలకు చెందిన ఎవరో ఒక నాయకుడిని ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com