30.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

పిల్లల్ని కనాలని స్టాలిన్‌ ఎందుకంటున్నారు?

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. కానీ, జనాభా విస్ఫోటనానికి భయపడింది. జనాభా నియంత్రణ పద్ధుతులు అవలంబించింది. అయితే, ఆ ప్రయోగం బెడిసి కొట్టింది. చైనాలో జనాభా సంక్షోభం ఏర్పడింది. జనాభాను పెంచడానికి ఆ దేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. అటు.. జపాన్ కూడా జనాభా సంక్షోభాన్ని గ్రహించి అదే పని చేస్తోంది. మరోవైపు.. దక్షిణ కొరియాలో కూడా జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది. అక్కడ కూడా ‘పిల్లల్ని కనండి మహా ప్రభో’ అంటూ ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇదే పిలుపునిచ్చారు. అయితే, ఇప్పటిదాకా చెప్పుకున్న దేశాల్లో జనాభా సంక్షోభానికి, ఇప్పుడు స్టాలిన్‌ ఇస్తున్న పిలుపునకు వ్యత్యాసం ఉంది. మన దేశంలో జనాభా సంక్షోభం లేకపోయినప్పటికీ ఉత్తర భారతం, దక్షిణ భారతాన్ని పోల్చి చూస్తే పలు అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఉత్తర భారత దేశంతో పోలిస్తే.. దక్షిణాదిలో జనాభా తక్కువగా ఉండటం ఒకటైతే.. రాజకీయంగా ఉత్తరాది ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలన్న దృక్ఫథం రెండోది. అసలు ఈ ఆలోచనల పరమార్థం, వాస్తవ పరిస్థితులేంటో చూద్దాం…

మన దేశంలో జనాభా సంక్షోభం వంటి పరిస్థితులు ఇప్పటికైతే లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి ఉండదన్న గ్యారెంటీ లేదు. అయితే, దక్షిణ భారతదేశంలో జనాభా సంక్షోభం ఉంది. అందువల్లే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిల్లల్ని కనాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. వీలైనంత మంది ఎక్కువ పిల్లల్ని కంటే బాగుంటుందని.. వినియోగదారుల మార్కెట్ పెరిగి రాష్ట్రాలు బాగుపడతాయని చెబుతున్నారు. ఆ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఓ సందర్భంలో వీలైనంత మంది పిల్లల్ని కనాలని పిలుపు నిచ్చారు. జనాభా ఎక్కువగా ఉండటం వల్లే ఉత్తర భారత దేశంలో పార్లమెంటు స్థానాలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే ఆ రాష్ట్రాలకు చెందిన నాయకులే దేశాన్ని పరిపాలిస్తున్నారన్న అభిప్రాయాలు మొదటినుంచీ ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో పార్లమెంటు స్థానాల గురించి మాట్లాడకపోయినప్పటికీ.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం నేరుగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

పైళ్లైన కొత్త జంటలు అన్నీ త్వరగా పిల్లల్ని కనాలని స్టాలిన్‌ సూచిస్తున్నారు. అంతేకాకుండా వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టాలని కూడా చెబుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన మాత్రమే నియోజక వర్గాలను నిర్ణయిస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు తగ్గిపోతాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై మరోసారి స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్ షాకింగ్ కామెంట్లు చేశారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే ఒకే ఒక్క ప్లాన్ ఉందని చెప్పారు. ముఖ్యంగా నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ప్లాన్ గురించి వివరించారు. గతంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు కాస్త ఆలస్యంగా పిల్లల్ని కనమని చెప్పానని ముఖ్యమంత్రి వెల్లడించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని.. నియోజక వర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందని.. అందుకే తాను గతంలో చెప్పిన మాటను మార్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో తాము కుటుంబ నియంత్రణపై మాత్రమే దృష్టి సారించామని కానీ ఇప్పుడు రాష్ట్ర జనాభాను పెంచుకోక తప్పని పరిస్థితుల్లో పడ్డామని వివరించారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే తొలి సారి కాదు. ఇటీవలే ఓ పెళ్లికి వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. పరిమితంగా పిల్లల్ని కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రమ ప్రచారాన్ని చేపట్టామని.. కానీ దీని వల్ల నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఏర్పడిందన్నారు.

తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్టాలిన్ పార్లమెంటు స్థానాలు, హిందీ వ్యతిరేక అంశాలను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానానికి వ్యతిరేకంగా డీఎంకే కార్యకర్తలు అక్కడ ఉద్యమం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దకూడదని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై హిందీతో రాసిన అక్షరాలను నలుపు రంగుతో తుడిచివేస్తున్నారు.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి అధికారం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల పెత్తనంపై సమరం ప్రకటించారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని.. అప్పుడే దక్షిణ భారత దేశంలో తమిళనాడు కీలకంగా ఉంటుందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో జరిగిన ఓ సభలో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.”గతంలో కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేశాం. ఇప్పుడు పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్నాం. అందువల్లే ప్రజలు నా మాట వినడానికి కోరుతున్నామని” స్టాలిన్ పేర్కొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com