డీప్ సీక్.. ఏఐలో ఓ కొత్త విప్లవాన్ని సృష్టించింది చైనాకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ దెబ్బకు అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఓ కుదుపు నమోదైంది. చాలా పెద్ద కంపెనీలు భారీగా నష్టాలను చవిచూశాయి. అయితే దీని ఎఫెక్ట్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై కూడ గట్టిగానే పడిందని ఇప్పుడు నివేదికలు చెబుతున్నాయి. ఈ స్టార్టప్ కంపెనీ దెబ్బకు మస్క్ సంపద ఏకంగా 90 బిలియన్ డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో చెప్పాలటే రూ.7.9 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఒక్క మస్క్ మాత్రమే కాదు ఎన్విడియా, మెటా అధినేతల ఆస్తులతో పాటు.. ఏఐ రంగంలో ఉన్న కంపెనీల తలరాతలు కూడా కాస్త మారాయనే చెప్పాలి.
దీనంతటికి కారణం లియాంగ్ వెన్ఫెంగ్. డీప్‌సీక్‌ను స్థాపించి, డెవలప్ చేసింది ఆయనే. 2023లోనే ఈ కంపెనీ ప్రారంభమైనా.. రీసెంట్గా R1 పేరుతో ఓ మోడల్‌ను రిలీజ్ చేసింది. ఇది ఓపెన్ ఏఐ, క్లాడ్ సోనెట్ వంటి సంస్థలు డబ్బులు తీసుకొని అందించే సేవలను ఉచితంగా అందించింది. ఇది మాత్రమే కాదు.. ఎన్విడియా అనే కంపెనీ రూపొందించే చిప్స్తోనే ఏఐ మోడల్స్‌ను రూపొందిస్తారు. అయితే తాము ఆ కంపెనీ అందించే మోడల్స్ కంటే తక్కువ అడ్వాన్స్డ్ చిప్స్తోనే డెవలప్ చేశామని ఎప్పుడైతే ప్రకటించిందో అమెరికా స్టాక్ మార్కెట్లో ఓ కుదుపు ప్రారంభమైంది. టెక్ దిగ్గజాల కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇందులో ఎన్విడియాతో పాటు మెటా, ఒరాకిల్, టెస్లా కంపెనీలు కూడ ఉన్నాయి.
డీప్‌సీక్ ఎఫెక్ట్ ఎంతలా ఉంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్విడియా. ఈ కంపెనీ ఏకంగా 600 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. అమెరికా చరిత్రలో అతి తక్కువ సమయంలో ఓ కంపెనీ ఇంత భారీ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి అని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.