33.9 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

ఏఐ యుగంలో పారిశ్రామిక వేత్తలు కొత్తగా ఆలోచించాలి

ప్రస్తుత ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ యుగంలో పారిశ్రామిక వేత్తలు సరికొత్తగా ఆలోచించాలని, సృజనాత్మకతకు పదును పెట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. ఏఐ యుగంలోనూ పాత ఆలోచనలతో సంప్రదాయ బద్దంగా ముందుకు వెళ్తే మన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. పరిశ్రమలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు.

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో “ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ – ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన “సమ్మిట్ ఆన్ ఫ్యూచర్ – రెడీ ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్మేషన్: ఇన్నోవేటింగ్ ఫర్ గ్రోత్, ఎఫిషియన్సీ అండ్ సెక్యూరిటీ (గ్రోత్ ఎక్స్ 2025)”ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని, ముఖ్యంగా కృత్రిమ మేథ-ఏఐ అందుబాటులోకి రావడంతో అన్ని రంగాల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. అలాగే.. అనేక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన తీరు మారాలని శ్రీధర్‌ బాబు సూచించారు. ఏఐ, క్వాంటమ్, మెషిన్ లెర్నింగ్ తదితర కొత్త టెక్నాలజీస్ సాయంతో సమాజం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లకు పరిష్కారాలను చూపించొచ్చన్నారు. ఆ దిశగా ఆవిష్కర్తలు కొత్తగా ఆలోచించాలని కోరుతున్నానని చెప్పారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇది తేలికైన విషయం కాదని, కానీ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకుపోతుందని శ్రీధర్‌ బాబు చెప్పారు. సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో తెలంగాణ వృద్ధి రేటు 17.98 శాతం కాగా.. జాతీయ సగటు 8 శాతం మాత్రమే అని.. ఐటీ రంగంలో తెలంగాణ సత్తా ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు.

ఉపాధి, జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటానే అధికమని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు మారాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో వీటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కు హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏఐ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించామని, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు మరింత సమర్థవంతంగా చేర్చేందుకు కృషి చేస్తున్నామని శ్రీధర్‌ బాబు చెప్పారు. ఈ సదస్సు నిర్వహణలో ఎఫ్టీసీసీఐ, టీ –హబ్, టీ-వర్క్స్, టాస్క్, వీ హబ్, గూగుల్, మైక్రోస్థాప్ తదితర సంస్థలు పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు.. ప్రొ ఫిన్‌ టెక్‌ స్టాల్‌ను సందర్శించారు. ఐఏఎస్‌ అధికారి, కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ డిప్యూటీ కమిషనర్‌ భవానీ శ్రీతో కలిసి సందర్శించిన సమయంలో ప్రొ ఫిన్‌ టెక్‌ సంస్థ కార్యకలాపాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. అనంతరం సంస్థ ప్రతినిధి సూర్యనారాయణ, ఇతర సిబ్బందితో కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com