-
కులగణనపై ఆసక్తి కరువు
-
ప్రభుత్వం ఆశయానికి అడ్డంకులు
-
మళ్లీ అవకాశమిచ్చినా లేని స్పందన
-
రెండో విడతలోనూ మారని తీరు
తెలంగాణలో కుల గణన ముగిసింది. తొలి విడత కుల గణనలో వివరాలు నమోదు చేసుకోని వాళ్లకోసం ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. పలు రకాల ఆప్షన్లు కూడా ఇచ్చింది. ఎన్యూమరేటర్లు ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయడం, ప్రజలు ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేసుకోవడం, వీటికి తోడు.. సర్వే కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం వంటి ఆప్షన్లు ఇచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే అధికారులే ఇంటికి వచ్చి సర్వే వివరాలు నమోదు చేసుకుంటారని ప్రకటించింది. కానీ, రెండో విడతలోనూ అదే తీరు కనిపించింది. మొదటినుంచీ చెప్పుకుంటున్నట్లుగానే జరిగింది. ఇటు.. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నుంచి పెద్దగా సీరియస్ నెస్ కనిపించ లేదు. అటు.. ప్రజల నుంచి కూడా సర్వేలో పాల్గొనాలన్న ఆసక్తి అస్సలు కనిపించలేదు. ప్రధానంగా హైదరాబాద్‌లో అస్సలు సర్వేకు స్పందన నిల్ అని చెప్పొచ్చు. ఈ పరిణామాలతో మరోసారి సర్వేల ఫెయిల్యూర్‌కు హైదరాబాద్ ప్రధాన కారణంగా అర్థమవుతోంది.
రెండోసారీ స్పందన అంతంత మాత్రమే… :
మొదటి విడత సర్వే పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3.56 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనకుండా మిగిలిపోయాయి. రాష్ట్రంలో ఉన్న కుటుంబాల్లో వీటి శాతం 3.1 శాతం. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సర్వేను సంపూర్ణంగా విజయవంతం చేయాలన్న లక్ష్యంతో మరోసారి కులగణనకు అవకాశం ఇచ్చింది. అయితే రెండో విడత సర్వేలో అస్సలు స్పందన కనిపించలేదు. రెండో విడత సర్వేలో కేవలం 18,539 కుటుంబాలు మాత్రమే వివరాలు నమోదు చేసుకున్నాయి. అంటే.. మిగిలి ఉన్న కుటుంబాల సంఖ్యలో ఇది కేవలం 5.21శాతం మాత్రమే.
మిగిలిపోయిన 3.1 శాతం కుటుంబాలు :
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వం తొలుత గుర్తించింది. ఈ కుటుంబాల సమగ్ర సమాచారం సేకరించేందుకు.. రాష్ట్రంలో మొదటి విడతగా గత యేడాది నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు కుల గణన సర్వే నిర్వహించారు. ఉద్యమ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే కోసం ప్రచారం చేపట్టింది. రాష్ట్రస్థాయి పర్యవేక్షణ నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి దాకా ఈ సర్వే సక్సెస్ కోసం అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బందిని, ఎన్యూమరేటర్లను నియమించింది. అయితే, మొదటి విడతలో 96.9 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొని తమ వివరాలు నమోదు చేయించుకున్నాయి. అంటే.. 1,12,15,134 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. ఆ సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 (3.1 శాతం) కుటుంబాలు మిగిలిపోయినట్లు తేల్చింది. వాళ్లందరి వివరాలు కూడా నమోదు చేయాలన్న లక్ష్యంతో రెండో విడత కుల గణనకు సర్కారు షెడ్యూల్ రూపొందించింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు రెండో విడత కుల గణన సర్వే చేపట్టింది.
మొత్తం సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 97.08 శాతం :
ఈ రెండు విడతల సర్వేల్లో చూసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కుటుంబాల్లో 97.08శాతం కుటుంబాలే సర్వేలో పాల్గొన్నట్లు తేలింది. దీనిని బట్టి చూస్తే.. రాష్ట్రంలో ఇంకా సర్వేలో పాల్గొనని, వివరాలు వెల్లడించని కుటుంబాల సంఖ్య 3,37,964 గా తేలింది. కుల గణన సర్వే సులువుగా పూర్తయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వివిధ రకాలుగా అవకాశం కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో ఆఫీసులకు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసుల్లో ప్రజా పాలనా కేంద్రాలకు వెళ్లి కూడా ప్రజలు వివరాలు నమోదు చేయించుకునే అవకాశం ఇచ్చారు. అలాగే, ఆన్ లైన్‌లో ఫారమ్ డౌన్ లోడ్ చేసుకుని, స్వయంగా నింపి, అధికారులకు అందజేసేందుకూ వీలు కల్పించింది. అయినా, అనుకున్నంత స్పందన మాత్రం రాలేదు.
కులగణన లెక్కల్లో స్వల్ప మార్పులు :
కుల గణన రెండో విడత సర్వేలో నమోదైన 18,539 కుటుంబాలను కూడా ఆన్‌లైన్‌లో అప్ డేట్ చేస్తున్నారు. దీంతో, రాష్ట్రంలోని కులాల లెక్కల్లో స్వల్పంగా తేడా ఏర్పడనుంది. తొలి విడత సర్వేలో ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్ట్ మేరకు రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43 శాతం (61,84,319), ఎస్టీల జనాభా 10.45 శాతం (37,05,929 ), బీసీల జనాభా 46.25 శాతం (1,64,09,179) ఉన్నట్టు తేల్చారు. వీరితో పాటు.. మొత్తం ముస్లిం జనాభా 12.56 శాతం (44,57,012) కాగా ఇందులో బీసీ ముస్లింల జనాభా 2.48 శాతం( 8,80,424 ), ఓసీ ముస్లింల జనాభా10.08 శాతం (35,76,588), ఇతర ఓసీల జనాభా 13.31 శాతం (44,21,115)గా ఉన్నాయి. రెండో విడత సర్వే వివరాలను కూడా క్రోడీకరిస్తే.. ఈ లెక్కల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
మాట తప్పిన కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు :
ఇక, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, గతంలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్, కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్‌రావు వంటి వాళ్లు రెండో విడత సర్వేలో కూడా తమ వివరాలు నమోదు చేసుకోలేదు. వాస్తవానికి తొలి విడత సర్వే పూర్తయిన తర్వాత వీళ్లు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీసీల లెక్కలన్నీ తప్పులని పదే పదే ఆరోపణలు చేశారు. అసలు సర్వేలో పాల్గొనని వాళ్లకు విమర్శించే అర్హత లేదంటూ ప్రభుత్వం ఎదురు దాడికి దిగడంతో.. రెండోసారి సర్వే చేయిస్తే.. తాము వివరాలు నమోదు చేయించుకుంటామని బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం.. రెండో విడత సర్వే చేపట్టినప్పటికీ.. అవసరమైనంత సమయం ఇచ్చినప్పటికీ ఈ సారి కూడా బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు సర్వేలో పాల్గొనలేదు. తమ వివరాలు వెల్లడించలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు నెలకొన్నాయి.