ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరు అత్యంత వివాదాస్పదం అవుతోంది. నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చిన దృశ్యాలు బయటకు రావడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలింగ్ సిబ్బందే ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీకి దగ్గరుండి మరీ ఓట్లేయించారన్న ఆరోపణలు, బయటకు వచ్చిన వీడియోలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేదిగా ఉందన్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీస్థానానికి జరిగిన ఎన్నికల్లో తీరుపై అంతటా చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఏజెంట్లను కూడా లోపలికి అనుమతించకుండా స్లిప్పుల పంపిణీ పేరుతో టీడీపీకి ఓటేయాలంటూ డైరక్ట్‌గా సిబ్బందే స్లిప్పులు అందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నియోజక వర్గంలో బాహాటంగా టీడీపీ కోసం రిగ్గింగ్ జరిగిందని హర్షకుమార్ ఆరోపించారు. ఏజెంట్లను లోపలికి అనుమతించకుండా, స్లిప్పుల పంపిణీ పేరుతో గుట్టుగా టీడీపీకి ఓటేయమని స్లిప్పులు అటాచ్ చేసి మరీ ఓటర్లను లోపలికి పంపారన్న విమర్శలు వస్తున్నాయి. విలేకరులు నిలదీసి ప్రశ్నించడంతో నీళ్లు నమిలిన సిబ్బంది వీడియో రన్నింగ్‌లో ఉండగానే వాటిని తీసి చెత్తబుట్టలో వేసేశారని చెబుతున్నారు.
పల్నాడు ప్రాంతంలోని దుర్గి , బెల్లంకొండ లాంటి ఏరియాల్లోని పలు బూతులలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ఏజెంట్లను బయటకు పంపి మరీ అధికార కూటమి అక్రమాలకు పాల్పడిందని అక్కడ పోటీచేసిన లక్ష్మణ రావు ఆరోపించారు. మొత్తం ఏడు బూత్ లలో రిగ్గింగ్ జరిగిందని లక్ష్మణ రావు ఆరోపించారు. ఇక మంత్రి లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో అయితే కూటమి పార్టీలు పోలింగ్ బూత్ గేట్ల దగ్గర కూడా ప్రచారం సాగించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కృష్ణా, గుంటూరుల నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర, గోదావరి జిల్లాలనుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్ధి పేరాల రాజశేఖరం గెలుపు కోసం కూటమి నేతలు బాహాటంగా ప్రచారం చేసుకున్నా పోలీసులు, పోలింగ్ సిబ్బంది కూడా ప్రేక్షక పాత్ర పోషించారన్న విమర్శలు వినిపించాయి.
మరోవైపు.. అనేక చోట్ల ఓటర్లకు డబ్బులు కూడా పంచారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక అంటేనే పెద్దల సభకు జరిగేది. అక్కడ ఓటర్లు, పోటీ చేసేవాళ్లు కూడా కనీసం గ్రాడ్యుయేట్ చదివిన వాళ్లే. వాళ్లంతా కొంత ప్రమాణాలను పాటిస్తూ ఉండే పెద్ద మనుషుల స్థాయి వ్యక్తులని అందరూ అనుకునే అవకాశం ఉంది. కానీ, ఆ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్ధులు నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించడం.. ఓటర్లు అంతకన్నా బరి తెగించడం అనేది ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో ఓటర్లు అందరూ గ్రాడ్యుయేట్లే అయినా.. డబ్బులు తీసుకొనే ఓటేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కోటాలో రెండు సీట్లకు ఎన్నికలు జరిగితే కూటమి నేతలు అడుగడుగునా నిబంధనలకు నీళ్లొదిలారని అంటున్నారు. అభ్యర్థులు ఏకంగా పోలింగ్ కేంద్రాల ప్రాంగణంలోనే మీడియా సమావేశాలు నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన కె.లక్ష్మణ రావు పోలింగ్ తీరుపై దుమ్మెత్తి పోశారు. పలు కేంద్రాల్లో తమ ఏజెంట్లను బయటకు తరిమేశారని, అధికార కూటమి అన్నీ వదిలేసి బాహాటంగా ప్రచారాలకు, రిగ్గింగులకు తెగబడిందని ఆరోపించారు. అలాగే, కొన్ని చోట్ల ఉదయం 12 గంటల లోపు 20 శాతం పోలింగ్ అయిన చోట్ల.. సాయంత్రం చివరి గంటలో 90 శాతం పోలింగ్ జరిగినట్లు లెక్కలు చూపారని అంటున్నారు. ఆఖరి గంటలో అసలు ఊహించనంతగా పోలింగ్ జరగడం అసాధ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చదువుకున్న వారే పోటీ చేసే, బాగా చదువుకున్న వాళ్లే ఓట్లేసే మండలి ఎన్నికల్లో ఇంతగా ప్రమాణాలు దిగజారడం చూస్తుంటే సామాన్య ఓటర్లు ప్రలోభాలకు లొంగి ఓట్లేయడం, ఉచితాలకు ఎగబడి రాజకీయ పార్టీలను గెలిపించడం అనేది చర్చించాల్సిన అంశమే కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.