34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

బీహార్‌ లో బీజేపి ఆపరేషన్ షురూ…

  •  నితీష్‌ తలొగ్గడం వెనక ఇంత కథ ఉందా?
  • ఏకంగా ఏడు మంత్రిపదవులతో విస్తరణ
  • నితీష్‌ మెడలు వంచి చేయించిన బీజేపి
  • వరుస విజయాలతో బీజేపిలో ఫుల్‌ జోష్‌
  • ఢిల్లీ గెలుపుతో రెట్టింపు అయిన దూకుడు
  • నితీష్‌ గ్రాఫ్‌ పడిపోతోందా? అందుకేనా ఇలా?
  • ఎవరిది వ్యూహాత్మక ఎత్తుగడ?
  • భవిష్యత్తు ఏం చెబుతోంది?

అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో బీహార్ లో కేబినెట్‌ విస్తరణ చేయించి ఆపరేషన్ బీహార్ మొదలు పెట్టేసింది బీజేపి. మొన్నటి బడ్జెట్‌ లోనే బీహార్‌ కు వరాల జల్లు ప్రకటించడంతో ఇది స్పష్టమైంది..పార్టీ బలపడాలంటే ఆశావహులకు పదవులు దక్కాలి. వాస్తవానికి గతంతో పోలిస్తే బీహార్ లో బీజేపి పుంజుకుందనే చెప్పాలి.ఎందుకంటే 2020 ఎన్నికల్లో బీజేపి జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. బీజేపి 74సీట్లు గెలిస్తే నితీష్‌ గెలిచినవి 43 సీట్లే. అయినా నితీష్ కుమార్ కి ఉన్నపలుకుబడి, ఒత్తిడి రాజకీయాలు ఫలించి ఆయన సీఎం అయ్యారు.అలవి కాని చోట అధికులమనరాదు అన్న సూక్తిని పాటించి బీజేపి తొలిసారి పుంజుకున్నా తగ్గి మిత్రపక్షంగా కొనసాగింది. అంతే కాదు అప్పటినుంచి మంత్రిపదవుల్లో కూడా బీజేపికి దాదాపు ప్రాతినిధ్యమే లేదు. మొన్నటి వరకూ ఒకే ఒక బీజేపి నేతను మంత్రిని చేశారు. కానీ ఈమధ్య ఆయన కూడా రాజీనామా చేసేశారు. ఇప్పుడిక ఎన్నికల టైమ్‌ కాబట్టి, పార్టీకి ఉత్సాహం తేవాలంటే కేబినెట్‌ విస్తరణ అనివార్యమని నమ్ముతున్న బీజేపి ఇటీవల మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలలో వరస గెలుపులతో తన స్వరం పెంచింది. ఎక్కువ సీట్లున్నా… ఇన్నాళ్లు మిత్రధర్మం పాటించి అణిగి మణిగి ఉంది. కానీ తాజా విజయాలు బీజేపి లో ఆశలు రేపుతున్నాయి.

నడ్డా ఒత్తిడితోనే…

బీజేపి జాతీయ అధ్యక్షుడు జే.పి.నడ్డా నితీష్ తో జరిపిన మంతనాలు ఫలించి నితీష్‌ గతిలేని స్థితిలోనే కేబినెట్‌ విస్తరణకు ఒప్పుకున్నారు. ఏకంగా ఏడు మంత్రి పదవులు ఆ పార్టీకి కేటాయించారు. ఎన్నికలను దృష్టి లో ఉంచుకుని సామాజిక, కుల సమీకరణల ఆధారంగా వాటిని అభ్యర్ధులకు బీజేపి కట్టబెట్టింది.

నితీష్‌ ఎందుకిలా?

సాధారణంగా అయితే అదీ మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు పెట్టుకుని కేబినెట్‌ విస్తరణకు ఎవరూ ఒప్పుకోరు.అందులో నితీష్‌ లాంటి నికార్సయిన రాజకీయ వేత్త అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే తమ పార్టీకన్నా ఎక్కువ సీట్లు గెలిచినా బీజేపి నుంచి కేబినెట్‌ లో ఒకే ఒక్కరికి ఛాన్స్ కల్పించిన ఘనుడు.పైగా ఆర్జేడి ఎల్జేపి లాంటి పార్టీలు సోదిలోకి కూడా లేకుండా పోవడంతో ఆయన బీజేపితో జట్టు కట్టాల్సిన పరిస్థితి.

కానీ ఇప్పుడు బొమ్మ తిరగబడి బీజేపి బలం పెరుగుతుండటం, ఎన్డీఏలో తిరుగులేని భాగస్వామిగా నిలబడటం, జేడీయూ బలహీనపడటం, నితీష్‌ కు ఒంట్లో ఓపిక సన్నగిల్లడం, వయోభారం, మతిమరుపు అన్నీ కలసి ఆయన మౌనంగానే సహకరించారు. గత ఎన్నికలలో నితీష్‌ తక్కువ సీట్లు గెలిచినా రాజకీయంగా బలంగా ఉండటం వల్లే బీజేపిని తొక్కిపెట్టి తను సీఎం అవగలిగారు. ఇప్పుడిక నితీష్‌ పని అయిపోయిందా? అనిపిస్తోంది. ఎందుకంటే గత కొంత కాలంగా బీజేపి తీసుకుంటున్న అన్ని వివాదాస్పద నిర్ణయాలను మౌనంగానే ఆయన అంగీకరిస్తున్నారు. మామూలుగా అయితే చీటికి మాటికి అలగడం, తూచ్ అంటూ కూటమినుంచి వైదొలగడం ఆయనకు అలవాటే. మాట చెల్లకపోయినా, తన ఆధిక్యత చూపాలనుకున్నా, రాజకీయంగా అడ్వాంటేజ్ వస్తుందనుకున్నా క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుడ్ బై కొట్టేయడం కూటమి ఫిరాయించేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. గతంలో నితీష్‌ ఆడింది ఆట.. పాడింది పాట.. ఇప్పుడిక సీన్ రివర్స్ అవుతోందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నితీష్‌ ఎందుకు తగ్గారు?

కాకపోతే మరో కారణం కూడా ఉండి ఉండొచ్చు.దాదాపు 20 ఏళ్ల ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలా తగ్గి ఉన్నది లేదు. 9 ఏళ్లు సీఎంగా కొనసాగిన నితీష్‌పై సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది. ఇప్పుడు బీజేపికి ఎదురు తిరిగితే కలిగే పర్యవసానాలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టే ఒత్తిడికి తలొగ్గి కేబినెట్‌ విస్తరణ చేసి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతున్నారా? సహజంగా భాగస్వామ్య పక్షాలు తలొగ్గి ఉండాలని కోరుకునే మనస్తత్వం బీజేపిది. మహారాష్ట్రలో ఏంజరిగిందో అందరికీ తెలిసిందే.అవసరమైతే ఏక్ నాథ్ షిండేలను సృష్టించి పార్టీలను చీల్చగలదు. నితీష్‌ ఎన్నో సార్లు బీజేపికి ఝలక్‌ ఇచ్చినా ఆ పార్టీ మౌనంగా భరించింది.కానీ ఇప్పుడు తలొంచక తప్పడం లేదా? లేక ఇదో వ్యూకహాత్మక మౌనమా? అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.

మొత్తానికి బీజేపి జూలు విదులుస్తోంది. ఆపరేషన్ బీహార్‌ తో అధికారం దిశగా అడుగులేస్తోంది. ఇది విజయం సాధిస్తే ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌ పైనే కావచ్చు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com