బట్టతల.. ఇది వయసులతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది. ఇది యువత, నడివయస్కులను తీవ్రంగా కలత పెడుతున్న అంశం. ఆడపిల్లలకు సహజసిద్ధంగా ఉండే జుట్టును కత్తిరించుకుంటు మోడ్రన్ గా ఉంటున్నారు కానీ.. మగపిల్లలకు మాత్రం జుట్టు లేకపోతే ఇష్టపడరు. ఈ మధ్య కాలంలో మగవారిని తీవ్రంగా కలత పెడుతున్న అంశం బట్టతలే. లేని వయసును మీదేసుకోడం అంటే ఎవరికైనా ఇబ్బందే. బట్టతల వ్యక్తిని చూసే తీరే తేడాగా ఉంటుంది. 40లు దాటక పోయినా వారికో పెద్ద మనిషి హోదా ఇచ్చేసి బలవంతంగా పెద్దరికం అంటగట్టేస్తారు. అందుకే చాలా మంది మగవారు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్, విగ్గులు, క్యాప్ ధరించి యంగ్ గా కనిపించేందుకు ట్రై చేస్తుంటారు.
బట్టతల ఎందుకొస్తుంది?
సాధారణంగా బట్టతల అనేది కొంత వంశపారంపర్యంగా వస్తుంటుంది. తాతలు, తండ్రులకు బట్ట తల ఉంటే అది వారసత్వంగా వస్తుంటుంది.జన్యుపరంగా వచ్చే ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉండకపోవచ్చు కానీ… అసాధారణంగా బట్ట తలలు వచ్చేయడమే ఇప్పుడు కలవర పెడుతున్న అంశం.
మూడు గ్రామాలకు బట్టతల టెన్షన్…
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మూడు గ్రామాల ప్రజలకు వారాలు, నెలల వ్యవధిలోనే వయసులతో సంబంధం లేకుండా బట్టతల వచ్చేసింది. ఆ మూడు గ్రామాల ప్రజల మానసిక వేదనకు అంతు లేదు. కుర్రాళ్లు కాలేజీలకు వెళ్లడం మానేశారు. పెళ్లిళ్లు కుదరడం ఆగిపోయింది. వయసుకు మించిన పెద్దరికం కనిపిస్తుండటంతో ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇలా మూడూళ్ళు వాళ్లు నరకం అనుభవించారు. మొత్తానికి స్థానిక డాక్టర్ వారి తిండిని పరీక్షించి అందులో కల్తీ ఉందని గుర్తించారు. వారు రొట్టెలు వాడేందుకు ఉపయోగించే గోధుమలు, జొన్న పిండిలలో ఎక్కువ మొత్తంలో సెలీనియం పెరిగినట్లు గుర్తించారు. వారి శరీరాల్లో అసాధారణ స్థాయిలో పెరిగిన ఈ కంటెంట్ జుట్టును ఊడిపోయేలా చేసింది.పైగా శరీరంలో అధిక సెలీనియం ఉన్న జింక్ ను కూడా తగ్గించేస్తుంది. దీనికి కారణం కల్తీ పిండిని వాడటమే. మహారాష్ట్రకు ఎక్కువగా పంజాబ్ నుంచి గోధుమ పిండి, జొన్నపిండి సరఫరా అవుతున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉండే భూముల్లో సెలీనియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అక్కడ పండే పంటల్లో ఇది చాలా ఎక్కువ. కాబట్టి ఆ పిండి వాడకం వల్ల వీరందరికీ ఈ సమస్య వచ్చి ఉంటుందనేది ఒక అంచనా. కారణం తెలిసాక కొందరు ఆ పిండిని వాడటం మానేశారు. వారందరికీ నెలల వ్యవధిలో పోయిన జుట్టు చక్కగా తిరిగి వచ్చేసింది. దీన్ని బట్టే కాలుష్యం ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తోంది.
వాతావరణ కాలుష్యం, జీవన శైలి, ఒత్తిడి, తాగే నీరు అన్నీత్వరగా జుట్టు రాలిపోడానికి కారణమవుతున్నాయన్నది హెయిర్ కేర్ నిపుణుల మాట. కొన్ని ప్రాంతాల్లో హార్డ్ వాటర్ అంటే ఉప్పునీరు తప్ప గతిలేని పరిస్థితులు ఉన్నాయి. వారందరికీ కూడా జుట్టు రాలే శాతం ఎక్కువే. హార్మోన్ల అసమతుల్యత కూడా జుట్టు రాలడానికి కారణమే. మగవారిలో టెస్టోస్టిరోన్, ఆడవారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం అనేది హార్మోన్ల ఇంబాలెన్స్ వల్ల తలెత్తుతుంది. హార్మోన్ల అసమతుల్యత ఎందుకొస్తుందంటే కాలుష్యం, పోషకాహారలోపం. ఇక ఎండలో ఎక్కువగా తిరగాల్సి రావడం,తగిన సంరక్షణ చర్యలు తీసుకోకపోవడం, ఆధునిక జీవన శైలి తెస్తున్న అలవాట్లు, మార్కెట్లో రసాయనిక మోతాదులు ఎక్కువగా ఉండే రకరకాల షాంపులు వాడటం, సాధారణంగా ఎక్కువగా జుట్టు రాలడానికి దారి తీస్తుంటాయి. సిల్కీ అనీ, యాంటీ డాండ్రఫ్, అనీ ఇలా రకరకాల బ్రాండ్లు దిగుతున్నాయి. అన్నీ జుట్టు కుదుళ్లపై తీవ్ర ప్రభావం చూపేవే.
కాలుష్య ప్రభావం తీవ్రం…
తినే తిండి, తాగే నీళ్లు,పీల్చేగాలి అన్నీ ప్రమాదకరంగానే ఉంటున్నాయి. జంక్ ఫుడ్ తినడం వల్ల ఆ ప్రభావం హార్మోన్ల ఇంబాలెన్స్ కు దారి తీస్తుంది.థైరాయిడ్ లాంటి సమస్యలు చుట్టు ముడుతుంటాయి. గాలి కాలుష్యం కూడా జుట్టు టెక్సర్ పాడవడానికి కారణమే. అధిక కార్బన్ను విడుదల చేసే హెవీ వెహికల్స్, ఫ్యాక్టరీలు వదిలే విష రసాయన వాయువులు అన్నీజుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పరిశ్రమల చుట్టు పక్కల ఉన్న ఇళ్ల వారికి శరీరంలో ధాతులోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యర్ధాల పెరుగుదలా ఎక్కువే. ఇవన్నీ జుట్టు ఊడిపోడానికి, రంగు మారిపోయి రాగి జుట్టులా అయిపోడానికి దారి తీస్తాయి. బోరు నుంచి వచ్చే నీటిని తాగినా, తల స్నానానికి వాడినా జుట్టు బిరుసెక్కి,చిట్లి పోయి, రంగు మారిపోయి త్వరగా ఊడిపోతుంది. కానీ పట్టణాల్లో పెరుగుతున్న అవసరాలరీత్యా అందరికీ ట్యాప్ వాటర్ సాధ్యం కాదు.
జంక్ ఫుడ్…కల్తీ…
జంక్ ఫుడ్ లో వాడే మితిమీరిన రసాయనాలు, నూనెలు హార్మోన్ల ఇంబాలెన్స్ కు దారి తీస్తాయి. ప్రోసెస్డ్ ఫుడ్ వల్ల మన శరీరానికి పోషకాలు అందవు. చాలా మంది తెల్లగా, మెత్తగా చూసేందుకు బాగుందని ప్రోసెస్డ్ పిండిలను, బియ్యాన్నే కొంటుంటారు. అందులో శరీరానికి అవసరమైన పీచు పదార్ధాలు కానీ, విటమిన్లు, మినరల్స్ కలిగిన బయటి పొరను తొలగించడం వల్ల అందులో కార్పొహైడ్రేట్లు తప్ప ఏమీ మిగలవు. పిండిపదార్ధం జీవ క్రియలను కుంటు పరచి హార్మోన్ల సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మార్కెట్ నుంచి కొనే సరుకు కూడా చాలా చాలా ముఖ్యమే. ఎక్కువగా పొట్టు తీయని తృణ ధాన్యాలు వాడటం అత్యుత్తమం అని డాక్టర్లు భాస్కర మీడియాకు తెలిపారు. వీటిలో ఎన్నో శరీరానికి అవసరమయ్యే పోషకాలు దాగుంటాయి. తినే వస్తువును రంగు, వాసన, కనపడే తీరును బట్టి ఎంపిక చేయరాదని ప్యాకేజీ పై నుండే వివరాలు ముందుగా చదివి అందులో ఉండే కంటెంట్లను బట్టి ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే కంటికి నదురుగా ఉండేవి ఎంపిక చేసుకుంటే ఊబకాయం, జుట్టు రాలే సమస్యలతో పాటు, థైరాయిడ్ సమస్యలు కూడా ఎక్కువేనంటున్నారు.
జీవన శైలి…
అయిదంకెల జీతానికి అలవాటు పడిన ప్రతీవారు ఇతర సౌకర్యాల కోసం ఈఎంఐలు కట్టడానికి ఓవర్ టైమ్ పని చేస్తున్నారు.తిండి, నిద్ర సమయం గాడితప్పుతున్నా పట్టించుకోరు. ఆరోగ్యకరమైన మనిషికి 7, 8 గంటల నిద్ర అవసరం. కానీ ఇప్పుడు మూడు గంటలు పడుకోవడం కూడా గగనమే. నిద్ర లేమి కూడా జుట్టు ఊడటానికి కారణమే.సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఎండకు ఎక్స్ పోజ్ కాకపోవడం వల్ల డీ విటమిన్ గణనీయంగా తగ్గిపోతోంది.నైట్ షిప్టులు చేసే వారికి కూడా జుట్టు రాలే సమస్య అధికమే. లేట్ చేస్తే తొందరగా బట్టతలకు దారితీస్తుంది.
అలాగే వేసవి ఎండల్లో తలపై ఎలాంటి రక్షణ లేకుండా తిరిగేయడంవల్ల సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలకు జుట్టు ఎక్స్ పోజ్ కావడం వల్ల బిరుసెక్కి, సహజత్వం, తేమలు ఇంకిపోయి పెళుసుబారుతుంది.కాబట్టి తగిన రక్షణతో మాత్రమే ఎండలో బయటకు వెళ్లాలి.
పని ఒత్తిడి, స్ట్రెస్..
13,14 గంటలు పని నిరంతరాయంగా పనిచేయడం వల్ల తల వేడెక్కడం ఖాయం.. తలపై చర్మం దాని సహజ గుణాలైన తేమను, ఆరోగ్యాన్ని కోల్పోతే తలెత్తే చర్మ సంబంధ సమస్యలు జుట్టు రాలడానికి కారణమవుతాయి.అలాగే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఆ స్ట్రెస్ ను తట్టుకోడానికి శరీరం కొన్నిరకాల రసాయనాలను విడుదల చేస్తుంది.తలకట్టు అందంగా లేదని చాలా మంది ఏసీ రూమ్ లలో కూడా కనిపించకుండా ఉండేందుకు టోపీలు పెట్టుకుని పని చేస్తుంటారు. ఇది మంచిది కాదంటున్నారు వైద్యులు.నీడ పట్టున ఉన్నప్పుడు తలను గాలికి ఎక్స్ పోజ్ చేయాలి.లేదంటే శరీరం వెలువరించే చెమట, ఇతర వ్యర్ధాలు తలపైనే నిల్వ అయిపోయి చర్మ రోగాలకు దారి తీస్తున్నాయన్నది ఒక పరిశీలనలో తేలిన అంశం.ఏసీ రూమ్ లలో ఉండేవారు నీరు ఎక్కువగా తాగినప్పుడే ఆ తేమ జుట్టు కుదుళ్లకు కూడా అందుతుంది. శరీరంలో విడుదలయ్యే హానికారక టాక్సిన్సు చెమట రూపంలో బయటకు పోవాలంటే నీరు ఎక్కువగా తాగాలి.
ఆకు కూరలు, పళ్లు
జుట్టు పోషణలో ఆకు కూరలది పెద్ద పాత్ర.. ప్రతీరోజు మన డైట్ లో ఆకు కూరలు ఎక్కువగా తినాలని, చర్మ ఆరోగ్యానికి సంబంధించిన విటమిన్ ఈ,కె లాంటివి మన ఫుడ్ లో ఉండేలా,అలాగే సహజమైన రసాయనాలు ఎక్కువగా వినియోగించని ఆహారాన్నే తినాలని ఆహారం ఎంపిక పట్ల చాలా జాగ్రత్త వహించాలని వైద్యులు భాస్కర మీడియాకు తెలిపారు.ఈ కల్తీ ప్రపంచంలో కుటుంబ అవసరాలకు సరిపడ ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకోవడం అంత ఉత్తమం లేదంటున్నారు వైద్యులు.వివిధరకాలైన పళ్ల ద్వారాకూడా పోషకాలు బాగా అందుతాయి.
అన్నింటికీ మించి పాజిటివ్ థాట్స్ జుట్టు సంరక్షణలో కీలకమైన రోల్ ప్లే చేస్తాయి.శరీరంలో నెగటివ్ ఎనర్జీ స్టోర్ కాకుండా, మంచి ఆలోచనలతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో,మంచి జీవన శైలి బట్ట తల త్వరగా రాకుండా అరికట్టవచ్చన్నది పోషకాహార నిపుణులు,డాక్టర్లు చెబుతున్న మాట.