29 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై కసరత్తు

  • రేసులో ముందున్న వీ.మురళీధరన్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఖట్టర్‌
  • జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్‌ మాధవ్‌.. కేంద్ర కార్యాలయ బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అగ్రనాకత్వం చేస్తున్న కసరత్తు తుది అంకానికి చేరుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీనడ్డా 2019లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తరువాత 2020లో మొదటి సారి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎంపికయ్యారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం రెండు పర్యాయాలు మాత్రమే ఒక వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా పనిచేయాలి. ఆలెక్కన చూసుకుంటే 2024 జనవరి మాసంతో జేపీ నడ్డా రెండు పర్యాయాల పదవీ కాలం పూర్తయిపోయింది. అయితే 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా నడ్డానే కొనసాగించారు. ఇక 2005 జనవరి మాసం కల్లా కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చెయ్యాలి. ఆమేరకు ప్రక్రియ ప్రారంభించినా క్షేత్రస్ధాయి నుంచి సంస్ధాగత నిర్మాణంలో జాప్యం జరగడంతో ఆ ప్రభావం జాతీయ అధ్యక్షుడిపై పడింది. దీంతో ఇక లాభం లేదనుకున్నారో ఏమో ముందు జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో అటు సంఘ్‌ ఆశీర్వాదంతో ఇటు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా ఆశీస్సులతో ముగ్గురి నలుగురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వారిలో ప్రధానంగా కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు వెల్లంవెల్లి మురళీధరన్‌ పేరును బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదికి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం అప్పగించినట్లు ఉంటుదన్న ఆలోచనలో మురళీధరన్‌ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 70 దశకం తొలి నాళ్ళలో ఈయన ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తరువాత హర్యానాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకులు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఖట్టర్‌ కేంద్ర విద్యుత్‌ మరియూ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. వీరిద్దరే కాకుండా మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేరు కూడా రేసులో ముందుంది. ఈయనకు సంఘ మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు ముగ్గురే కాకుండా కర్నాటకు చెందిన బీఎల్‌సంతోష్‌ పేరు కూడా అధ్యక్ష స్ధానానికి పరిశీలిస్తున్న పేర్లలో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈయన బీజేపీ జాతీయ ఆర్గనైజేషన్‌ సెక్రటరీగా ఉన్నారు.

వివిధ కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ సంస్తాగత నిర్మాణం స్తంభించిపోయింది. పలు రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో పీఠముడులు పడటం, తద్వారా రాష్ట్ర అధ్యక్షుల ఎంపికలో జాప్యం జరగడంతో జాతీయ అధ్యక్షుడి విషయంలో కూడా అనుకున్న సమయానికి ఎంపిక చేయలేని పరిస్ధితి నెలకొంది. ఎన్నిసార్లు గడువు విధించిన కొన్ని రాష్ట్రాల్లో ఆయా జిల్లాల అధ్యక్షుల ఎంపికలో అనేక రకాలైన ఒత్తిడులు వస్తున్న నేపథ్యంలో జిల్లా బాధ్యులను ఖరారు చెయ్యడం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తలకుమించిన పనిలా తయారయ్యింది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుంటే జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయి రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన కూడా షెడ్యూల్‌ ప్రకారం ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిపోయి ఉండాలి. కానీ జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా ఇప్పటి వరకూ పూర్తి చేయలేకపోవడం కారణంగా రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనలో కూడా సందిగ్దత నెలకొంది. సాధారణంగా భారతీయ జనతాపార్టీ సంస్ధాగత నిర్మాణం జిల్లాల అధ్యక్షుల ఎంపికతో మొదలై… తరువాత రాష్ట్ర అధ్యక్షుల ప్రకటన అనంతరం జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. కానీ ఈ సారి అన్ని స్థాయిల్లో జాప్యం జరుగుతుండటంతో ఇక జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసి తరువాత రాష్ట్ర అధ్యక్షుల ప్రకటన చేయాలని బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు రామ్‌ మాధవ్‌ని కూడా తిరిగి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలం చేసి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. దానితో పాటు బీజేపీ కేంద్ర కార్యాలయ వ్యవహారాలు కూడా రామ్‌ మాధవ్‌కి అప్పచెప్పనున్నట్లు తెలుస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com