ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగిన మహాకుంభ మేళా… మహాశివరాత్రితో వైభవంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు త్రివేణి సంగమంలోని అరైల్ ఘట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పడవలో ప్రయాణం చేసి .. గంగా హారతిలో పాల్గొన్నారు. యూపీ క్యాబినెట్ ఆ ఈవెంట్‌లో పాల్గొన్నది. డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్, కేపీ మౌర్య ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఆ తర్వాత పారిశుద్య కార్మికులతో కలిసి సీఎం యోగి భోజనం చేశారు. లంచ్‌లో మంత్రులు, పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి మహాకుంభ మేళాలో పాల్గొన్న ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. మహాకుంభ్‌లో పాల్గొన్న శానిటేషన్, హెల్త్ వర్కర్లకు పది వేల బోనస్ ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం 16వేలు అందే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాత్కాలిక హెల్త్ వర్కర్లకు.. నేరుగా నగదును బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్లు తెలిపారు. ఆ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు చెప్పారు.