ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. సొరంగాల్లో సహాయక చర్యలపై అనుభవం ఉన్న ప్రత్యేక బృందాలను, మెరికల్లాంటి జవాన్లను కూడా రప్పించారు. మూడు రోజులుగా శ్రమిస్తోన్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన, అలాగే, మార్కోస్ టీమ్‌లు ఎట్టకేలకు కాసేపటి క్రితం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. ఎనిమిది మంది కార్మికులు చిక్కుకు పోయారని అంచనా వేస్తున్న ప్రాంతానికి రెస్క్యూ టీమ్‌లు చేరుకున్నాయి. లోపల చిక్కుకున్న కార్మికులను పేర్లు పెట్టి పిలుస్తూ.. శబ్దాలు చేస్తూ ముందుకు కదులు తున్నారు. ఈ క్రమంలోనే బురద, మట్టి, ఊట నీరును బయటకు తోడేస్తున్నారు. ఓవైపు వీటిని బయటకు తోడేస్తూనే.. మరోవైపు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నారు. చివరకు కార్మికులు చిక్కుకు పోయిన 14వ కిలోమీటర్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే రెస్క్యూ బృందాలు అన్వేషిస్తున్నాయి.
శిథిలాల లోపలే 8 మంది :
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో ఈ నెల 22వ తేదీన ప్రమాదం జరిగింది. టన్నెల్ బోరింగ్ మెషీన్‌తో పనులు ప్రారంభించగానే.. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు సొరంగమంతా ఊగిపోయింది. పైభాగం కొంత వరకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సరిగ్గా టన్నెల్ ప్రారంభం నుంచి మొదలుకొని 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదం నుంచి 40 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. మరో ఎనిమిది మంది మాత్రం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు.
రంగంలోకి మార్కోస్ :
ప్రమాదం జరిగినప్పటినుంచీ రెస్క్యూ బృందాలు స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్నాయి. స్థానిక నిపుణులకు తోడు.. ఢిల్లీ నుంచి, ఉత్తర భారతం నుంచి నిష్ణాతులను రప్పించారు. అలాగే, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో నిపుణులను కూడా రప్పించారు. భూ, వాయు, నీటిలో ఎక్కడైనా ఆపరేషన్ చేపట్టగలిగే మార్కోస్ టీమ్‌ను కూడా రంగంలోకి దింపారు.
ఐదు రోజులకు కొలిక్కి వచ్చిన ఆపరేషన్ :
మరోవైపు.. ప్రమాదం జరిగిన ఐదు రోజులు గడుస్తుండటం, లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి సందేశాలు గానీ, సంకేతాలు రాకపోవడంతో వాళ్ల జాడ తెలియడం కష్టంగా మారింది. మరోవైపు.. ప్రస్తుతం సొరంగం లోపల కుప్పకూలిన ప్రదేశంలో భారీగా నీరు చేరిందని, పూడిక కూడా చాలా ఎత్తులో పేరుకుపోయిందని, ఈ పరిస్థితుల్లో శిథిలాలను తొలగిస్తే సొరంగం మళ్లీ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న నిపుణులు చెబుతున్నారు. అందుకే అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నామని, రెస్క్యూ ఆపరేషన్ నమ్మదిగా సాగుతోందని అంటున్నారు. అయితే, ఐదు రోజుల తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ఓ కొలిక్కి వచ్చినట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు చెబుతున్నారు.
నెమ్మదిగా సహాయక చర్యలు :
ఇక, ఈ ప్రమాదానికి ఒక్కసారిగా ఉబికి వచ్చిన నీరు, లోపల మట్టి అంతా తడిసి ఉండటం, పైకప్పు కుప్పకూలడమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. అందుకే.. ముందుగా సొరంగంలో పేరుకుపోయిన మట్టిని, నీటిని తొలగిస్తూ వచ్చారు. సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న బోరింగ్ మెషిన్, ఇతర పరికరాలను ఢ్రిల్లింగ్ చేసి తొలగించి ముందుకు సాగారు. అయితే, భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మరోవైపు.. టన్నెల్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలను రెస్క్యూ టీమ్‌లు విరమించుకున్నాయి.
రెస్క్యూ టీమ్‌లకు అందని ఆక్సిజన్ :
ఇక, నిన్న రాత్రి సంఘటనా స్థలానికి అతి సమీపంలోకి ప్రత్యేక బృందాలతో పాటు.. వాళ్లకు తోడుగా కొందరు కార్మికులు కూడా వెళ్లారు. దాదాపు ఘటనా స్థలికి 15 మీటర్ల దూరం వరకూ వెళ్లగలిగినట్లు ప్రత్యక్షంగా ఆపరేషన్‌లో పాల్గొంటున్న వాళ్లు చెప్పారు. అయితే, అక్కడంతా బురద, మట్టితో నిండి ఉంది. లోపలంతా భయానకంగా ఉందని చూసిన వాళ్లు చెప్పారు. అంతేకాదు.. అక్కడ ఆక్సిజన్ అందక పోవడంతో.. మరికొంతసేపు అక్కడే ఉంటే ప్రమాదమని గ్రహించారు. అప్పటికే కొందరు ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో.. ఆర్మీ, ఎన్‌డీఎఫ్, ఎస్‌డీఎఫ్ రెస్క్యూబృందాలు, వాళ్లతో పాటు వెళ్లిన స్థానిక కార్మికులు వెంటనే తిరిగి వెనక్కి వచ్చేశారు.
ఇవాళ జీరో పాయింట్‌కు రెస్క్యూ టీమ్‌లు :
ఈ భయానక అనుభవంతో ఇవాళ ఉదయం ఆక్సిజన్ సాయంతో రెస్క్యూ టీమ్‌లు మరోసారి టన్నెల్ లోపలికి వెళ్లాయి. ఈసారి ప్రమాదం జరిగిన జీరో పాయింట్‌కు రెస్క్యూ టీమ్ సభ్యులు, కార్మికులు చేరుకున్నాయని చెబుతున్నారు. అయితే, లోపల చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం తెలియడం లేదంటున్నారు. కార్మికులను పేరు పెట్టి పిలిచినా, శబ్దాలు చేసినా తప్పిపోయిన వాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదంటున్నారు. అయితే, వాళ్లు ఎక్కడైనా సొమ్మసిల్లి, నీరసించి పడిపోయి ఉంటారని క్షుణ్ణంగా వాళ్లకోసం టన్నెల్ లోపల జీరో పాయింట్‌కు చేరుకున్న బృందాలు వెతుకుతున్నారని చెబుతున్నారు. మరోవైపు టన్నెల్‌లో ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకు పోవడంతో ఆ బురదను తొలగించే పనులు ముమ్మరంగా సాగిస్తున్నారు.