ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు శివరాత్రి రోజు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో నలుగురు పోలీసులు గచ్చిబౌలిలోని పోసాని కృష్ణమురళి నివాసంలో ఆయన్ను ఆరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ధృవీకరించారు. బుధవారం రాత్రి 8.50 గంటల ప్రాంతంలో పోసాని నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకుని వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. గతంలో సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసు నిమిత్తమై పోసానిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ విషయంలో అరెస్ట్ చేస్తున్నారో, ఎవరు ఫిర్యాదుపై అరెస్ట్ చేస్తున్నరన్న విషయాలను చెప్పడానికి మాత్రం పోలీసులు నిరాకరించినట్లు పోసాని భార్య కుసుమలత చెపుతున్నారు. తన భర్తను అరెస్ట్ చేస్తున్నట్లు తనకు ఓ నోటీసు ఇచ్చి తీసుకువెళ్ళిపోయారని, అరెస్ట్ కు సంబంధించిన వివరాలేవీ తనకు గానీ కుటుంబ సభ్యులెవరికీ గానీ తెలపలేదని ఆమె చెప్పారు. తన భర్త అనారోగ్యంతో ఉన్నారని నోటీసులు ఇచ్చి వెళితే తాను రేపు ఉదయం వస్తానని చెప్పినా పోలీసులు వినలేదని కుసుమలత ఆవేదన చెందుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ 61(2), 111, 196, 353, 299, 366(3)(4), 341 సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోసానిపై ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్లోనే కాకుండా టీడీపీ, జనసేన నాయకులు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లోల కేసులు నమోదు చేశారు.
- Advertisement with us -