34.1 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూలో రంగంలోకి మార్కోస్

  • ఆ 40 మీటర్లే కీలకం

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం జరిగి ఐదు రోజులు గడిచింది. ఈనెల 22వ తేదీ నుంచి 8 మంది కార్మికులు లోపలే చిక్కున్నారు. ప్రస్తుతం టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి 34 మందితో కూడిన సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ల ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్లింది. ప్రస్తుతం అక్కడ తక్షణ సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు వారు అంచనాకు వచ్చారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్‌గా మారినట్లు చెబుతున్నారు.

టన్నెల్‌లో 15 అడుగుల ఎత్తులో 10 వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఆ బురదను బయటికి తీసేందుకు కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేస్తున్నారు. సొరంగం చివరలో పైకప్పు నుంచి పెద్ద ఎత్తున మడ్డి పడుతుండటం.. సొరంగం దిగువన 15 అడుగుల ఊబిలాంటి బురద ఉండటం, అక్కడ కారు చీకటి, సరైన గాలి లేకపోవటం వంటి ప్రతికూలతల కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందంటున్నారు. అధునాతన కెమెరాలు, పరికరాలు కూడా పని చేయటం లేదు. సొరంగంలో 12వ కిలో మీటర్ దాటిన తర్వాత బురద, నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండటంతో రెస్క్యూ టీమ్స్ ఇబ్బంది పడుతున్నాయి.

టన్నెల్‌లో సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగం చివరి భాగంలో పైకప్పు కూలి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందంతో అన్వేషణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లను రక్షించేందుకు ఆపరేషన్‌ మార్కోస్‌ చేపడుతున్నారు. నేల, నీరు, ఆకాశం.. ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్‌ మెరైన్‌ కమాండో ఫోర్స్‌ సభ్యులనే మార్కోస్‌గా పిలుస్తారు. కార్గిల్‌తోపాటు కశ్మీర్‌ తదితర ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఫలితాలను సాధించిన చరిత్ర ఆ టీమ్‌కు ఉంది. మార్కోస్‌తో పాటు బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ కూడా రంగంలోకి దిగుతోంది. గుట్టలు, పర్వత ప్రాంతాల్లో సొరంగాల నిర్మాణం, నిర్వహణ రికార్డు బీఆర్వోకు ఉంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com