- ఏక్షణమైనా వీసా రద్దయ్యే ప్రమాదం
- సెక్యూరిటీ అధికారుల చేతిలో అన్ని పవర్స్
- వారికి నచ్చకపోతే అప్పటికప్పుడు వెనక్కు పంపేస్తారు
- చెల్లించిన రెంటల్ అగ్రిమెంట్లు,లోన్లు, అన్నీ హుష్ కాకి
- అప్పటికప్పుడు తట్టా బుట్టా సర్దేసుకోవాల్సిందే
- కెనడా న్యూ వీసా రూల్స్ తో ఇండియన్స్ కి దెబ్బ
కెనడా వీసా రూల్స్ ని కఠినతరం చేసేసింది. అమెరికా తర్వాత ఎక్కువ మంది భారతీయులు వెళ్లేది కెనడాకే. అమెరికాతో పోలిస్తే అక్కడ వాతావరణం, వీసారూల్స్ అన్నీ చాలా సులభతరంగా ఉంటాయి. కాబట్టి భారతీయులు చాలా మంది అక్కడకి చదువులు,ఉద్యోగాలు,ఉపాధి నిమిత్తం పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. కానీ ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపధ్యంలో కెనడా కూడా అప్రమత్తమైంది.ఈ ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం అక్కడున్న విద్యార్ధులు, ఉద్యోగస్తులు, వలసవాదుల వీసా స్టాటస్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్పులు చేసేలా కొత్త నియమం అమల్లోకి తీసుకొచ్చింది. ఎవరిపైనైనా అనుమానాలు, ఇబ్బందులు,అభ్యంతరాలు తలెత్తితే వారి వీసా పర్మిట్ ను కుదించడం, రద్దు చేయడం, మార్పులు చేయడం లాంటి అపరిమిత అధికారాలను సొంతం చేసుకుంది.
బోర్డర్ సెక్యూరిటీ అధికారులకి వీసా పై అధికారాలు
ఈ కొత్త ఇమ్మిగ్రేషన్, శరణార్ధుల రక్షణ పాలసీ ప్రకారం కెనడా సరిహద్దులలో అధికారులకు టెంపరరీ నివాస డాక్యుమెంట్లను అంటే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ టెంపరరీ రెసిడెంట్ వీసాలను ఎప్పుడైనా రద్దు చేసే అధికారాలు మంజూరు చేసింది.అంటే బోర్డర్ సెక్యూరిటీ అధికారులు వర్క్ పర్మిట్లు, స్టూడెంట్ వీసాలు తదితరాలను అప్పటికప్పుడు రద్దు చేయడం, లేదా అనుమతి నిరాకరించడం చేయవచ్చు. అంటే ఎవరైనా కెనడాలో పనిచేస్తున్న అధికారి తీరు సరిగా లేదని వారు భావిస్తే వారి అనుమతి నియామకాలు, నివాస పత్రాలు అన్నింటినీ రద్దు చేసి వీసా గడువు ముగియకపోయినా వెనక్కు పంపేస్తారు. లేదా ఎవరైనా కొత్తగా రాదలచుకున్న వారి సాక్ష్యాధారాలు, సంబంధిత పత్రాలతో వారు సంతృప్తి చెందకపోతే వారికి వీసా నిరాకరించవచ్చు.ఈ అనుమతులు ఇవ్వడం లేదా నిరాకరించడం అధికారాలన్నీ ఆ బోర్డర్ అధికారి చేతిలో ఉంటాయి. ఈ కొత్త నిబంధనల ప్రభావం అక్కడ వేలాది మందిపై పడే అవకాశముంది. అక్కడున్న వారిలో ఎక్కువ సంఖ్యలో భారతీయులు ఉన్నారు.
అమెరికా తర్వాత ఇక్కడికే…
విదేశీవిద్యకు, పనికి అమెరికా తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది కెనడాయే. అక్కడ చదువుకుంటున్న వారిలో ఏకంగా 4.2 లక్షల మంది భారతీయులు ఉన్నారని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. విద్యార్ధులు, ఉద్యోగులు, మైగ్రంట్ల అభ్యర్ధనలను తిరస్కరించదలిస్తే వారిని పోర్టు ఎంట్రీలోనే నిలువరించి అట్నుంచి అటే స్వదేశానికి పంపేస్తారు. అలాగే అక్కడ ఉండి చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారి పై అధికారులకు అసంతృప్తి కలిగితే వారి వీసా, ఇతర అనుమతులు రద్దు చేసి నిర్దేశిత గడువులోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశిస్తారు.
అలాగే కెనడాలో టూరిస్టు వీసా మీద ఉండేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరికి వివిధ కాల వ్యవధితో పర్మిట్లు ఉన్నాయి.2024లో తొలి ఆరు నెలల్లో మనదేశం నుంచి కెనడాలో టూరిస్టు వీసాపై వచ్చి అక్కడ ఉంటున్న వారి సంఖ్య మూడు లక్షల ఆరువేలు. అలాగే అంతకుముందు కూడా 2023 లో తొలి ఆరునెలల్లో ఇలా టెంపరరీ వీసాల మీద అక్కడున్నవారి సంఖ్య మూడు లక్షల నాలుగువేలు. ఇది కెనడా అధికారులిచ్చిన వివరాలు.
ఈ తాజా నోటిఫికేషన్ పరిధిలోకి వచ్చేవారికి త్వరలోనే వారి ఐఆర్ సిసి అక్కౌంట్ మెయిల్ అడ్రస్ కు నోటీసులు వస్తాయి.అయితే ఇలా నోటీసులందుకుని వీసాలు రద్దయిన వారు ఇప్పటికే అక్కడ కట్టిన ఫీజులు, వ్యాపారానికి సంబంధించిన లీజు అడ్వాన్సులు, ఇంటి అద్దెల అగ్రిమెంట్ సొమ్ము, అప్పులు లాంటి వాటి విషయంలో ఏం చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. అయితే నవంబర్ లోనే (ఎస్ డీఎస్ ప్రోగ్రామ్) స్టూడెంట్లు డైరక్ట్ స్ట్రీమ్ వీసా ప్రోగ్రామ్ ద్వారా కెనడాలోకి భారతీయ విద్యార్ధులకు అనుమతించే సర్వీస్ ను రద్దు చేశారు.ఈ రూట్ లో కెనడాలోకి ఎంట్రీ ఇచ్చేవారు ముందుగానే సొమ్ము చెల్లించి అడుగు పెడతారు.కాబట్టి వారి సొమ్ముసంగతి ఏమవుతుందన్నఅంశంపై కూడా నో క్లారిటీ.