36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

మంత్రపురిలో ప్రసిద్ధిగాంచిన పంచ శివాలయాలు

  • శివరాత్రికి ముస్తాబవుతున్న ఆలయాలు

  • దక్షిణ భారతదేశంలోనే పశ్చిమ ముఖంగా వెలిసిన ఏకైక శివలింగం

  • మహిమాన్విత శివలింగానికి నిత్య పూజలు

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శివాలయాలను అందంగా అలంకరిస్తున్నారు. ఈనెల 26వ తేదీ మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మంత్రపురిలోని శ్రీ ఓంకారేశ్వర, శ్రీ భిక్షేశ్వర, శ్రీ శీలేశ్వర – సిద్దేశ్వర, శ్రీ గౌతమేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించబడే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

పంచ ముఖాలు కలిగిన భోళా శంకరునికి మంత్రపురిలో ఐదు శివాలయాలు వందల సంవత్సరాలుగా ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ముఖ్యంగా తమ్మి చెరువు కట్ట వీధిలో ఉన్న శ్రీ భిక్షేశ్వర స్వామి దేవాలయంలో పశ్చిమ ముఖంలో వెలసిన శ్రీ భిక్షేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. కాశీ తర్వాత పశ్చిమ ముఖ ద్వారంగా వెలసిన ఏకైక శివ లింగంగా శ్రీ భిక్షేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. శ్రీ భిక్షేశ్వర స్వామి భక్తులకు భిక్ష పెట్టేవాడుగా చెప్పబడుతుంది. గతంలో బోడగుడిగా పిలువబడే శ్రీ భిక్షేశ్వర దేవాలయానికి కీర్తిశేషులు మహావాది విస్సయ్య కుమారుడు నరసయ్య శిఖరాన్ని కట్టించారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది. ఆలయ ముఖ ద్వారంలోకి ప్రవేశించగానే మొదట లింగ రూపంగా దక్షిణామూర్తి దర్శనమిస్తారు. అనంతరం భిఘ్నేశ్వర స్వామి, అన్నపూర్ణ అమ్మ వారు, నందీశ్వరుడు కొలువుతీరి ఉండడం విశేషం. గర్భగుడిలో ఎంతో పెద్దదిగా పశ్చిమ ముఖంగా శ్రీ భిక్షేశ్వర స్వామి కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తుంటారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వంటి ఎందరో ప్రముఖులు ఈ ఆలయంలోని శ్రీ భిక్షేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ సందర్భంగా చాగంటి తన అనేక ప్రవచనాల్లో ఈ ఆలయ ప్రాముఖ్యతను తెలుపుతూ ఎంతో మహిమాన్వితం కలిగిన ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటే వారి జన్మ సార్థకం అవుతుందని తెలిపారు.

శివరాత్రి పర్వదినం రోజున అర్ధరాత్రి నిషిదళం పెట్టడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారికి “నిషి” దళాన్ని సమర్పిస్తుంటారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ ఆలయంలో అర్ధరాత్రి 12 గంటలకు నిషిదళాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. శివునికి పంచ ముఖాలు ఉన్నట్లు మంథనిలో కూడా పంచ శివాలయాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

ప్రతి సోమవారం ఈ ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహిస్తారు. శ్రీ ఓంకారేశ్వర స్వామి, శ్రీ భిక్షేశ్వర స్వామి, గోదావరి నదీ తీరంలో గల శ్రీ గౌతమేశ్వర స్వామి, శ్రీ శీలేశ్వర – శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయాల్లో నిత్యం పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే గోదావరి తీరంలో శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ సురాభాండేశ్వర స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి. శివరాత్రి రోజున భక్తులు పూర్తిగా ఉపవాస దీక్ష ఆచరిస్తూ ఈ శివాలయాల్లోని స్వామివారికి నిషిదళాన్ని సమర్పిస్తూ పునీతులవుతారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com