తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమవుతోంది. తొలుత జనవరి సెకండ్ వీక్‌లో ప్రకటన వస్తుందని జోరుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫిబ్రవరి చివరలో అంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని వరంగల్ పర్యటనలో వెల్లడించారు. దీంతో పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ నేతలు, కార్యకర్తల్లో మొదలైంది.
తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం బీసీల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నట్లు కులగణన నివేదిక తేల్చింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 42 సీట్లను బీసీలకు ఇస్తామన్నారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినా, పార్టీ పరంగా తాము సీట్లు కేటాయిస్తామని స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో బీజేపీ ఆలోచనలో పడింది. తొలుత ఈటెలను నియమించాలనే అంచనాకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీని అనుసరిస్తే ఆ ట్రాప్‌లో పడ్డామనే అపవాదు వస్తుందని కమలనాథులు భావిస్తున్నారని సమాచారం. ఎలాంటి సమస్య లేకుండా మహిళకు అప్పగిస్తే బాగుంటుందని మెజార్టీ నేతలు చెబుతున్నారు. అలాగైతే రేసులో ఉన్న ఏకైక మహిళ డీకె అరుణ. మహిళా కోటాలో ఆమెని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదే జరిగితే ఈటెలకు బిగ్ షాక్ తప్పదని అంటున్నారు. బీజేపీ ఆలోచన వెనుక కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు అధ్యక్షురాలిగా డీకే అరుణను నియమిస్తే పార్టీ మంచి ఫలితాలు వస్తాయని లెక్కలు వేస్తోంది కాషాయ దళం. దీనిద్వారా దక్షిణ తెలంగాణలో పట్టు సాధించేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీలు మహిళలకు అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భం లేదు. ఇది పార్టీకి కలిసి వస్తుందని భావిస్తోంది. డీకే అరుణ విషయానికొస్తే.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన అనుభవం ఆమె సొంతం. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. అరుణకు పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలోపేతమవుతుందని అంచనా వేస్తున్నారు.
గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పని చేశారామె. కేంద్రం మైనార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తుల కమిటీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా డీకే అరుణకు అవకాశం కల్పిస్తారని ఆమె వర్గీయులు భావించారు. అయితే ఆ పదవి బండి సంజయ్‌కు దక్కింది. మరో పదవి వస్తుందని ఆమె చాలా ఆశలు పెట్టుకున్నారు.
అయితే డికె అరుణకు పగ్గాలు ఇస్తే ప్రధాన పార్టీలు అన్ని అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇచ్చాయనే అపవాదు కూడా వచ్చే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉన్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణ మూటకట్టుకునే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతలు వేరే పార్టీల నుంచి వచ్చిన వారు కావడంతో వీరిని కాదని మరో కొత్త నేతను తెరమీదకు తీసుకొస్తారనే వాదన ఉంది.
ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా బీజేపీ విజయం సాధించింది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పగ్గాల కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేతల ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది.