కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో ఆమెను చికిత్స కోసం చేర్పించారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియాయగాంధీ.. ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం డాక్టర్ల బృందం అబ్జర్వేషన్ లో సోనియా గాంధీ ఉన్నారు. ‘ఉదర సంబంధిత సమస్యల కారణంగా సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తాం’ అని సర్ గంగా రామ్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ సమీరన్ పర్యవేక్షణలో సోనియా గాంధీ ఉన్నట్లు సమాచారం.
సోనియా గాంధీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, గతేడాది సెప్టెంబర్లోనూ అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఒకరోజు తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అంతేగాకుండా.. ఆరోగ్య కారణాల వల్ల గతేడాది డిసెంబర్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ – సీడబ్ల్యుసీ సమావేశానికి సైతం సోనియా గాంధీ హాజరు కాలేదు. పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ సందర్భంగా ఫిబ్రవరి 13న సోనియా గాంధీ కనిపించారు.
సోనియా గాంధీ వయసు 78 ఏళ్లు. అయితే, సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారనే వార్త కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది. సోనియా ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు. అసలు ఆమెకు ఏమైందో తెలియక కంగారుపడుతున్నారు. కాగా, సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరడానికి కారణాలు తెలియాల్సి ఉంది.