-
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో ‘బయో ఆసియా – 2025’ సదస్సును హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఏడాది ఏఐ -ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరివర్తన, లైఫ్ సైన్సెస్‌లో ఆవిష్కరణలు, డేటా ఇంటర్ ఆపరేబిలిటీ, క్లినికల్ ట్రయల్స్‌లో భారత్ పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఈ వేదిక ద్వారా జీవ, వైద్య, ఫార్మా రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, ఆవిష్కర్తలను ఒకే చోటుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశీయ, విదేశీ మార్కెట్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న అవకాశాలు, సవాళ్లను ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, క్వీన్స్‌ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్, జీ 20 షెర్ఫా అమితాబ్ కాంత్, అమెజాన్ ఛైర్మన్, సీఈవో రాబర్ట్ ఎ. బ్రాడ్‌వే, జీనోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఈడీ ప్రొ. పాట్రిక్ టాన్, మెడ్ ట్రానిక్ సీటీవో డా. కెన్ వాషింగ్టన్, మిల్టెని బయోటెక్ ఎండీ డా. బోరిస్ తదితరులు పాల్గొంటారన్నారు. ఈ నెల 25వ తేదీన జరుగబోయే సీఈవో కాన్ క్లేవ్ లో ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్ , ఎండీ డా. కృష్ణ ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈవో డా.సత్యనారాయణ చావా, నోవార్టిస్ అప్మా ప్రాంత చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్, లిల్లీ ఇండియా అధ్యక్షుడు, జీఎం విన్సెల్ టక్కర్ తదితరులు పాల్గొంటారని వివరించారు.