తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు ఫామ్ హౌజ్ నుంచి మరోసారి బయటకు వచ్చారు. పూర్తిస్థాయి రాజకీయ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరయ్యారు. అయితే, వచ్చీ రావడం తోనే, చాలా రోజుల తర్వాత జరిగిన సమావేశంలోనే కేసీఆర్ తమ పార్టీ నాయకులకు క్లాస్ పీకారు. ద్వితీయ శ్రేణి నాయకులపై కన్నెర్ర జేశారు. ఓ రకంగా వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి తమ పార్టీ నాయకులే కారణమన్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు.. పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు కావడంతో.. ఇక పార్టీ పని అయిపోయిందని బీఆర్ఎస్ పార్టీ నేతలే ప్రచారం చేశారని కేసీఆర్ సీరియస్ అయ్యారు. నాయకుల ఇలాంటి ప్రచారం వల్లే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిపోయారని వ్యాఖ్యానించారు. వాళ్లంతా నైరాశ్యంతోనే పార్టీ మారారన్నారు కేసీఆర్. ఇలాంటి ప్రచారం చేయడం సరైనది కాదు అని కేసీఆర్ హితవు పలికారు. నాయకులు ఇంకోసారి ఇలాంటి ప్రచారం చేయొద్దని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కష్టపడాలని కేసీఆర్ సూచించారు.