తెలంగాణలో త్వరలోనే కొత్త సెక్యూరిటీ పాలసీని తీసుకురాబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో సైబర్ డిఫెన్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇకపై సైబర్ సెక్యూరిటీ పరంగా తెలంగాణ సర్కారు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో టెక్నాలజీ రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్ రంగంలో తెలంగాణ రాష్ట్రం గణనీయంగా ఎదుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ గురించి ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని, ఇది టెక్నాలజీ రంగంలో ఎదుగుదలకు స్పష్టమైన సంకేతమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రూ.350 కోట్లు ఫ్రీజ్ చేసి రూ.183 కోట్లు భాదితులకు రిఫండ్ ఇవ్వడం ఒక రికార్డు అని ఆయన అన్నారు.
డిజిటల్ యుగంలో కొత్త అడుగులు, అలాగే సైబర్ నేరాలకు సంబంధించిన రిస్క్ లు కూడా పెరుగుతున్నాయని శ్రీధ్ బాబు అన్నారు. మనకంటే మన గురించి గూగుల్ కే ఎక్కువ తెలుసని.. కాబట్టి డిజిటల్ ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీపై పెద్ద జాగ్రత్త అవసరమని వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఇంకా పవర్ గ్రిడ్ వంటి క్షేత్రాల్లో కూడా ప్రవేశించారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సైబర్ నేరస్తులు మన డబ్బులు మాత్రమే కాదు, మన డేటాను కూడా దొంగలిస్తునారని హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సైబర్ నేరాల ద్వారా దాదాపు 10 ట్రిలియన్ రూపాయలు జనం నష్టపోతున్నారని, మన దేశంలో సైబర్ నేరాల ద్వారా రూ.15 వేల కోట్లు సైబర్ నేరగాల్లు కాజేస్తున్నారని చెప్పారు. సైబర్ చాలెంజ్‌లను అధిగమించేందుకు “షీల్డ్ కాంక్లెవ్” ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.