26.7 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా!

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. అయితే, బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎం విషయంలో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తోందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటివరకు కనీసం రేసులో లేని, ఎవరూ ఊహించని పేరును తెరపైకి తీసుకొచ్చింది. మొదటి నుంచీ ఢిల్లీ సీఎం రేసులో ఆరుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో రేఖా గుప్తా పేరు లేదు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ హై కమాండ్‌ రేఖా గుప్త వైపు మొగ్గు చూపుతోంది.

రేఖా గుప్తా పేరు ఢిల్లీ సీఎం పదవికి దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలు ఏ క్షణంలోనైనా రేఖా గుప్తా పేరును అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. షాలిమార్‌ బాగ్‌ నియోజకవర్గం నుంచి రేఖా గుప్తా మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మెజార్టీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అయితే, ఏ రాష్ట్రంలో కూడా మహిళా సీఎం లేరు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై రేఖా గుప్తాను కూర్చోబెట్టేందుకు భారతీయ జనతాపార్టీ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన రేఖా గుప్తా.. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. అంతేకాదు.. ఢిల్లీ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా కూడా గతంలో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పని చేసిన అనుభవం రేఖా గుప్తాకు ఉంది. పార్టీ పెద్దలతో ఎక్కువ సంబంధాలు ఉండడంతో ఈమెను ఎంపిక చేసినట్లుగా భావిస్తున్నారు.

అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం. ఢిల్లీలోనూ అదే ఫార్ములాను అమలు చేసేందుకు బీజేపీ మొగ్గు చూపుతుండటంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాకు అవకాశం లభిస్తోందంటున్నారు.

ఇక, ఈ నెల 20వ తేదీన రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం ఏర్పాట్లు ఘనంగా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ ప్రమాణస్వీకారానికి 50 మంది సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, దౌత్యవేత్తలకు ఆహ్వానాలు పంపాలని బీజేపీ అధిష్టానం అనుకుంటోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలతో పాటు కేంద్రమంత్రులు, మిత్రపక్షాల నేతలు కూడా హాజరుకానున్నారు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. మరిచిపోలేని విధంగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక దేశంలోని ఆధ్యాత్మిక వేత్తలు బాబా రామ్‌దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి వంటి ఇతర మత ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నారు. ఈ వేదికపై సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కైలాష్ ఖేర్ ఆధ్వర్యంలో సంగీత ప్రదర్శన జరగనుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com