తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ స్టేట్‌గా మారుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ లక్ష్యం కోసం అందరం సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ఈజీ మనీ కోసం ఎవరూ వెంపర్లాడవద్దని, కష్ట పడి పనిచేసి డబ్బులు సంపాదించుకొని అవసరాలు తీర్చుకోవాలన్నారు. లోన్ యాప్స్ జోలికి వెళ్లొద్దన్నారు. క్యాష్ ప్రైజ్, కోట్ల లాటరీ అని మెస్సేజ్‌లు వస్తే అలాంటి లింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని ప్రజలకు సూచించారు.
షీల్డ్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మొట్ట మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను అభినందించారు. డిజిటల్ సేఫ్టీ, ఫ్యూచర్ గురించి చర్చించేందుకు షీల్డ్ 2025 కాంక్లేవ్ వేదికగా మారిందన్నారు. తెలంగాణను నంబర్ వన్ సైబర్-సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు పనిచేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్థిక నేరాలు ఎంత ప్రమాదకరమో, సైబర్ నేరాలు కూడా అంతే ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో సైబర్ నేరగాళ్లు గడిచిన సంవత్సరం రూ. 22,812 కోట్లు దోచుకున్నారన్నది ఒక అంచనా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్ గా నిలపడమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమన్నారు. ప్రస్తుతం సమాజంలో ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పుగా పరిణమించిందన్నారు రేవంత్ రెడ్డి. ఇది ప్రజలకే కాదు.. ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టదాయకమన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో గందరగోళం ఏర్పడుతోందన్నారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిపుణులు, ఐటీ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, అన్ని రకాల వనరులు ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్‌గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. 1930 నంబర్‌ను అందరికీ షేర్ చేయాలని, దీనిపై చర్చ జరగాలని.. ఇది సైబర్ నేరాలకు సంబంధించిన నిరంతరాయంగా పనిచేసే హెల్ప్‌లైన్ అని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పౌరులను రక్షించడానికి సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి అని రేవంత్ రెడ్డి చెప్పారు.
టెక్నాలజీ పెరిగినకొద్దీ నేరాల తీరు కూడా వేగంగా మారుతోందని.. అందుకే ఈ సమయంలో షీల్డ్ 2025 అత్యంత కీలక సదస్సు అని అభివర్ణించారు. సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేయాలన్నారు. సైబర్ క్రైమ్‌ను నియంత్రించడంలో దేశంలోనే మన రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. కానీ, సైబర్ నేరాలను అరికట్టేందుకు సంబంధిత విభాగాలను బలోపేతం చేయాలని, నేరం జరిగిన తరువాత పట్టుకోవడం కాదు.. నేరం జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా నిరోధించగలగాలన్నారు. ఫేక్ న్యూస్‌తో పాటు ఆర్థిక నేరాలను నిరోధించాలన్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా మార్చుతామని సీఎం రేవంత్ చెప్పారు. గత ఏడాది 7 కొత్తగా రాష్ట్రంలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించామన్నారు.