సోమవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ నగరంతో పాటు బీహార్ రాష్ట్రంలోని సివాన్, హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, రోహ్తక్ ప్రాంతాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీలో సోమవారం ఉదయమే తీవ్రమైన భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూకంప తీవ్రత కారణంగా భూమి, భవనాలు కంపించడం అక్కడి ప్రజలు గమనించారు. భూమి ఈ విధంగా కంపించడంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ళు కంపించడంతో జనం భయంతో బయటకి పరుగులు తీసారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4 పాయింట్లుగా నమోదయ్యింది. భూకంపం సంభవించిన సమయంలో భూ ప్రకంపనలతో పాటు భూమిలోపల ఏదో విరిగిపోయినట్లు శబ్ధాలు వినిపించడంతో స్థానికులు మరింత భయకంపితులయ్యారు. సోమవారం నాటి భూకంప ప్రభావం ఢిల్లీ నగరం చుట్టూతా చూపించినట్లు సమాచారం. చాలాకాలం తరువాత ఢిల్లీలో ఈ స్ధాయి భూకంపం వచ్చినట్లు చెపుతున్నారు. అయితే అదృష్టం కొద్దీ ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఇక బీహార్ రాష్ట్రంలోని సివాన్ ప్రాంతంలో కూడా భూమి కంపించినట్లు అక్కడి స్థానికులు చెపుతున్నారు. ఇక్కడ కూడా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 పాయింట్లే నమోదయ్యింది. ఈ రెండు ప్రాంతాలతో పాటు ఢిల్లీ అత్యంత సమీపంలో ఉండే బహదూర్గఢ్, హర్యానా రాష్ట్ర పరిధిలోకి వచ్చే గురుగ్రామ్; సోనిపట్, ఫరీదాబాద్, రోహ్తక్ ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూ ప్రకంపనల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండలని, భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించి ప్రశాంతంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.