కులగణన రీ సర్వేకు కారణాలివే…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన సర్వే అభాసు పాలయ్యిందా? అభాసు పాలు చేశారా? ‘కర్ణుడి చావుకు కారణాలనేకం’ అన్నట్లు కుల గణన సర్వేపై వెల్లువెత్తుతున్న ఆరోపణలకు, చుట్టు ముడుతున్న విమర్శలకు కారణం ‘తిలా పాపం.. తలా పిడికెడు…’ అనుకోవచ్చా? కులగణన సర్వే ప్రణాళికల నుంచి మొదలుకుంటే.. సర్వే నిర్వహించిన వ్యూహాలు, పర్యవేక్షించిన తీరు, క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు, తమ వివరాలు అందజేయాల్సిన ప్రజలు.. ఇలా అందరికీ భాగముందనుకోవచ్చా? ఎన్నికల ముందుగానే హామీ ఇచ్చిన మేరకు.. ఎన్నికలయ్యాక.. ఓ ప్రణాళిక ప్రకారం ఏకంగా మంత్రివర్గ ఉపసంఘం వేసి.. మార్గదర్శకాలు కట్టుదిట్టంగా రూపొందించి.. ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చి.. పౌరులకు అవసరమైనంత సమయం ఇచ్చి.. నిర్వహించిన సమగ్ర కులగణన సర్వే ఎందుకు విమర్శల పాలవుతోంది? అసలు కులగణన రీసర్వే ఎందుకు చేయాల్సి వస్తోంది? భాస్కర న్యూస్ విశ్లేషణాత్మక కథనంలో చూద్దాం…
మంచికి పోతే చెడు ఎదురయ్యిందా? :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ వస్తోంది. అయితే, ప్రతి అంశానికీ అవసరమైనంత సమయం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు చెప్పినట్లు బీసీ కులగణన సర్వే అంశాన్ని కూడా బయటకు తీసింది. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్లుగా ఎవరూ చేయని, చేయలేని కులగణన సాహసాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దీనికోసం పకడ్బందీగానే ముందుకెళ్లినట్లు భావించింది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. సర్వే రిపోర్ట్ మొత్తం డిజిటలైజ్ చేసింది. అధికారికంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి సర్వే నివేదికను ప్రపంచానికి తెలియజేసింది. అయితే, అత్యంత సాహసోపేతమైన బీసీల కులగణన చేపట్టడంపై.. అప్పటిదాకా ఆహా.. ఓహో.. అని అన్ని వర్గాల నుంచి వచ్చిన ప్రశంసలు.. నివేదిక ప్రకటించిన వెంటనే రివర్స్ అయ్యాయి. ముఖ్యంగా విపక్షాల నుంచి మొదలుకుంటే.. అసలు తమకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతటి మహోన్నత నిర్ణయం తీసుకొని సర్వే చేయించిందని అభినందించిన బీసీ సంఘాలు కూడా నిరసన గళం ఎత్తుకున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ముప్పేట దాడి జరిగింది. ‘మంచికిపోతే చెడు ఎదురైనట్లు…’ అనవసరంగా ‘తేనెతుట్టెను కదిపామా?’ అన్న భావనలోకి ఓ దశలో ప్రభుత్వం వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది.
బీఆర్ఎస్ సర్వే రిపోర్ట్ అందుకే బయట పెట్టలేదా? :
అసలు పదేళ్ల క్రితమే సమగ్ర ఇంటింటి సర్వే చేయించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఆ సర్వే నివేదికను బయటకు ప్రకటించకపోవడానికి కారణమేంటి? రహస్యంగా బీరువాలో భద్రపరచడం వెనుక మతలబేంటి? మరి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన కుల గణన సర్వే ఫెయిల్యూర్ ఆరోపణలకు ప్రభుత్వం మాత్రమే కారణమా? సర్కారు లెక్కలు తప్పుల తడకనా? బీసీల జనాభా వాస్తవ సంఖ్య మరుగున పడిందా? క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటో చూద్దాం…
కులగణన జరిగిన తీరిదీ… :
తెలంగాణలో కుల గణన సర్వే కోసం ఒక లక్షా మూడు వేల 889 మంది ఎన్యుమరేటర్లు విధులు నిర్వర్తించారు. రాష్ట్రంలో నివసిస్తున్న ఒక కోటి పదిహేను లక్షల 71వేల 457 కుటుంబాలను గుర్తించగా.. ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల 134 కుటుంబాలను ఎన్యుమరేటర్లు సర్వే చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పలు కారణాలతో మూడు లక్షల 56వేల 323 కుటుంబాలను సర్వే చేయలేదని పేర్కొంది. దీంతో, తెలంగాణలో మొత్తం 96.9 శాతం కుటుంబాల సర్వే పూర్తయ్యిందని, 3.1 శాతం మంది కుల గణన సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం ప్రకటించింది. గత యేడాది నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన కులగణన సర్వే.. డిసెంబర్ 25వ తేదీ వరకు కొనసాగింది.
రీ సర్వే చేయాల్సి రావడానికి ప్రధాన కారణాలు :
అయితే, కులగణన రీ సర్వే చేయాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. సర్వేను పర్యవేక్షించిన ఉన్నతాధికారుల నుంచి మొదలుకుంటే.. ఎన్యూమరేటర్లను మానిటరింగ్ చేసిన అధికారులు, క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించిన ఎన్యూమరేటర్లు, చివరకు సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లకు పూర్తి వివరాలు అందించాల్సిన పౌరులు అందరూ దీనికి బాధ్యులే అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఎవరికి వారు తప్పించుకోవడానికో, లేదంటే సింప్లిఫై చేసుకోవడానికో, ఏదో చేశామన్నట్లు మమ అనిపించుకోవడానికో కిందిస్థాయి సిబ్బంది అలవాటు పడ్డారన్నది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. ఇప్పుడు కుల గణన అంశంలోనూ ఇదే జరిగిందంటున్నారు. ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాల్సిన ఎన్యూమరేటర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జనాభా లెక్కల విషయంలోనూ ఎన్యూమరేటర్లు తమ బాధ్యత తాము నిర్వర్తించకుండా.. ప్రైవేటు వ్యక్తులకు ఆ పనులు అప్పగించి తప్పుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగిందన్న చర్చ సాగుతోంది. బాధ్యతాయుతమైన ఎన్యూమరేటర్లకు, అదే పనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే చేసే సర్వేలకు సాధారణంగానే వ్యత్యాసం ఉంటుంది. ఫలితంగా ఏదో సర్వే ఫారాలు నింపేసి అధికారులకు అప్పగించామన్న రీతిలో చాలా ప్రాంతాల్లో సర్వే తూతూ మంత్రంగా సాగిందంటున్నారు. మరి.. ఇలాంటి అంశాలను పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ఇలాంటి లోపాలపై పెద్దగా దృష్టి సారించలేదన్న విమర్శలు వస్తున్నాయి.
కొరవడుతున్న పౌరుల సహకారం :
ఇక, సర్వేకు సంబంధించి తమ ఇంటికి వచ్చిన సిబ్బందికి సరైన వివరాలు అందించాల్సిన పౌరులు కూడా బాధ్యత మరుస్తున్నారన్న అంశం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పుడు జరిగిన కులగణన సర్వే మాత్రమే కాదు.. ఏ సర్వే అయినా ప్రజలు పెద్దగా సిబ్బందికి సహకరించడం లేదన్న విమర్శలున్నాయి. అంతేకాదు.. ఆధార్‌కార్డులు, అవసరమైన ఐడీ కార్డుల వివరాలు ఇవ్వడానికి కూడా జనం వెనుకంజ వేస్తున్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం.. తమ వివరాలు బయటపడితే ఇప్పటికే తమకు అమలవుతోన్న ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయన్న భయంతోనే సహకరించడం లేదన్న వాదనలున్నాయి. ఈ తరహా జనంలోనూ చదువుకున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. మరికొందరైతే రాజకీయ కారణాలతో తమకు మీ స్కీములు వద్దు, రిజర్వేషన్లు వద్దు.. మా వివరాలు మీకెందుకు? అంటూ ఎన్యూమరేట్ల ముఖంమీదే చెప్పిన అనుభవాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలో వలస కార్మికులు స్థానికులుగా ఈ సర్వేలలో పేర్లు నమోదు చేయించుకుంటున్నారని కూడా తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌లో ఐటీ, రియల్ ఎస్టేట్, ఫార్మా, డిజిటల్ రంగాలు విప్లవాత్మక స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కారణంగానే అనివార్యంగా వలస కార్మికులు అవసరమవుతున్నారు. వీటికోసం ఉత్తర భారతానికి చెందిన వలస కార్మికులు, ప్రధానంగా బిహార్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు, అన్‌స్కిల్డ్ లేబర్ హైదరాబాద్‌కు ఎక్కువశాతం మంది వస్తున్నారు. వీళ్లంతా ఇలాంటి సర్వేలు జరుగుతున్న సమయంలో స్థానికులుగా పేర్లు నమోదు చేయించుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఎన్యూమరేటర్లు కూడా స్థానికులు ఎలాగూ వివరాలు ఇచ్చేందుకు ముఖం చాటేస్తుండటంతో వలస కార్మికుల వివరాలతో అయినా సర్వే ఫారాలు నింపేయొచ్చన్న ఆలోచనలో ఎన్యూమరేటర్లు సర్వేను పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు.
రాజకీయంగా సహాయ నిరాకరణ :
కులగణన సర్వే ఫెయిల్యూర్ ఆరోపణలకు పౌరులు మాత్రమే కాదు.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ నాయకులూ ఆస్కారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేకు తాము సహకరించబోమని, ఎన్యూమరేటర్లకు వివరాలు చెప్పబోమని కొందరు ప్రజా ప్రతినిధులే బాహాటంగా ప్రకటించారు. మరికొందరు కేంద్ర మంత్రివర్గంలో బాధ్యతా యుతమైన స్థానంలో ఉన్నవాళ్లు కూడా వివరాలు ఇవ్వలేదు. జనాన్ని, పార్టీ కేడర్‌ను ప్రభావితం చేసే స్థానంలో ఉన్న వాళ్లు తమ వివరాలు ఇవ్వకపోగా.. తాము సర్వేలో పాల్గొనబోమని బాహాటంగా ప్రకటించడం మరికొందరిపై ప్రభావం చూపించింది. తమ పార్టీ నాయకులే సర్వేలో పాల్గొనడం లేదని, తాము కూడా వివరాలు ఇవ్వబోమని కొందరు ఎన్యూమరేటర్ల ముఖంమీదే చెప్పేశారు.
అభాసు పాలు కావడంలో హైదరాబాద్ పాత్ర? :
తెలంగాణలో ఏది చేసినా, ఏ అంశం చూసినా.. రాష్ట్రమంతా ఒక లెక్క, హైదరాబాద్ మాత్రమే ఇంకోలెక్క అన్నట్లు ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు కుల గణన సర్వే విషయంలోనూ ఇదే జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు కుల గణన సర్వేలో ఇప్పటిదాకా చెప్పుకున్న లోటుపాట్లకు ప్రధానంగా హైదరాబాదే కారణమన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్ కారణంగానే ఈ సర్వే కూడా అభాసుపాలైందంటున్నారు. కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఎన్యూమరేషస్ ప్రక్రియ సరిగా జరక్కపోవడం వల్లే సర్వే నివేదికల్లో ఖచ్చితమైన వివరాలు రావట్లేదన్న విపక్షాల విమర్శలకు బలం చేకూరుతుందంటున్నారు.